Friday, November 22, 2024

ఆదాయ మార్గాలపైనే ఆర్టీసీ దృష్టి.. మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలపై లేని ఆసక్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీఎస్‌ ఆర్టీసీ ఆదాయం సమకూరే మార్గాల్లో బస్సులు నడపడంపై కనబరుస్తున్న ఆసక్తి మారుమూల ప్రాంతాలపై కనబర్చడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌ నుంచి నగరాలు, పట్టణాలకు ఎక్కువ బస్సులు నడుపుతూ మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు కల్పించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా నష్టాల బాటలో నడుస్తున్న ఆర్టీసీ ఇటీవలే ఆ పరిస్థితి నుంచి బయటపడుతోంది. కొత్త రూట్లలో బస్సులు నడిపి ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ సంస్థ ఉన్నతాధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గతంలో రాష్ట్ర్రంలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి వివిధ పట్టణాలకు ఆర్టీసీ బస్సులు నడిపేది. ముఖ్యంగా భద్రాచలం కేంద్రంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, కర్నాటక, తమిళనాడు సహా వివిధ రాష్ట్ర్రాలకు బస్సులు నడిచేవి.

- Advertisement -

అయితే, ఆశించిన మేర సంస్థకు ఆదాయం సమకూరడం లేదన్న సాకుతో ఆ బస్సులను అర్ధాంతరంగా నిలిపివేశారు. దీంతో భద్రాచలం కేంద్రంగా చుట్టుపక్కల ఏజెన్సీ ప్రజలు సమీపంలోని పట్టణాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. భద్రాచలం నుంచి బెంగుళూరుకు గరుడ స్లీపర్‌ బస్‌ సర్వీసును నడపాలనే డిమాండ్‌ గత కొన్నేళ్లుగా ఉన్నప్పటికీ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది. అలాగే, భద్రాచలం నుంచి ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి రూట్‌ వైపు రోజూ వందల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ఈ రూట్లో బస్సు సర్వీసులను నడిపే విషయంపై ఆర్టీసీ అధికార యంత్రాంగం ఏమాత్రం దృష్టి సారించడం లేదనే విమర్శలున్నాయి. మరోవైపు, భద్రాచలం నుంచి మరో ఏజెన్సీ ప్రాంతమైన మల్కనగిరికి సైతం వెళ్లేందుకు సైతం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీరుస్తూ ప్రైవేటు ట్రావెల్స్‌ సొమ్ము చేసుకుంటున్నాయి. కాగా, రాష్ట్ర్రంలోని ఒక రాష్ట్ర్రం నుంచి మరో రాష్ట్రానికి బస్సులు నడపాలంటే ఆ రాష్ట్ర్రంతో ఒప్పందం ఉండాలని టీఎస్‌ ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఇక ఏ రూట్లలో బస్సులు నడిపితే లాభదాయకం, ఏ రూట్లలో ఆక్యుపెన్సీ ఎక్కువ ఉంది అనే అంశాలపై ఆయా రీజనల్‌ మేనేజర్లు, డీఎంలు నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. అయితే, లాభదాయకమైన రూట్లపై టీఎస్‌ ఆర్టీసీ గత కొద్ది రోజులుగా దృష్టి సారించిందనీ, ప్రయాణికులకు సౌకర్యంతో పాటు సంస్థకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్న రూట్లలో వెంటనే బస్సులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత ఏడాదిగా ఆర్టీసీలో సంస్కరణలు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో సంస్థను లాభాల బాటలో నడిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చీఫ్‌ ట్రాఫిక్‌ విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement