Saturday, November 23, 2024

ముందుకొచ్చిన ఆర్టీసీ.. స్పందన లేని టూరిజం

అమరావతి, ఆంధ్రప్రభ:రాష్ట్రంలో పురాతన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అద్భుత సౌందర్యమైన పర్యాటక ప్రాంతాలకు కొదవే లేదు. సముద్రతీర ప్రాంతాలు..నదీ పరివాహక పర్యాటకానికి కొదవే లేదు. పురాతన శిల్పకళా సంపద విస్తారంగా ఉంది. పర్యాటకులను ఆకర్షించేందుకు పర్యాటక శాఖ అనేక ప్రణాళికలు రూపొందిస్తోంది. గత ఫిబ్రవరిలో దేవదాయశాఖతో సమన్వయం చేసుకొని ఆధ్యాత్మిక పర్యాటకానికి కూడా శ్రీకారం చుట్టింది. అయితే పర్యాటక టూర్లకు ఇప్పుడున్న పరిస్థితుల్లో శాఖాపరంగా బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేసే పరిస్థితి పర్యాటక శాఖకు లేదు.

ఇదే సమయంలో ఆదాయం పెంపు కోసం కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్న ఆర్టీసీ పర్యాటక సర్క్యూట్లలో బస్సులు నడిపేందుకు ప్రతిపాదన చేసింది. గత ఏడాది చివరల్లో ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు పర్యాటక శాఖకు ప్రతిపాదనలు కూడా పంపారు. ఇప్పటి వరకు ప్రతిపాదనల పట్ల సానుకూలత వ్యక్తమైనట్లు లేదు. అదిగో..ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఇప్పటి వరకు నిర్థిష్టమైన విధివిధానాలు ఖరారు చేయలేదు. పొరుగు రాష్ట్రాల ఆర్టీసీలతో సంప్రదింపుల పేరిట తీవ్ర జాప్యం జరుగుతోంది. పర్యాటక శాఖ నుంచి తీవ్ర జాప్యం చేసుకుంటున్న నేపధ్యంలో ఆర్టీసీ అధికారులే పుణ్యక్షేత్రాలకు బస్సులను నడుపుతున్నారు.

పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు..

రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులను విస్తరించేందుకు ఎప్పటి నుంచో ప్రణాళికలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత వీటిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఆర్టీసీ ఆదాయం పెంపులో భాగంగా పలు ఆఫర్లతో పాటు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ సర్వీసులను నడుపుతున్నారు. తమిళనాడులోని అరుణాచలం బస్సు సర్వీసులకు రాష్ట్రం నుంచి విశేష స్పందన వస్తోంది. వివిధ జిల్లాల నుంచి పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలోని వివిధ పుణ్యక్షేత్రాలు, బౌద్ధ ఆరామాలు సహా వివిధ మార్గాల్లో భక్తుల కోసం నిర్వహిస్తున్న సర్వీసులకు ఆదరణ బాగుంది. కొన్ని పర్యాటక ప్రాంతాలకు కూడా ఆర్టీసీ సర్వీసులు నడుపుతోంది.

- Advertisement -

వసతి, సౌకర్యాల కోసం..

పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలకు సర్వీసులు నడుపుతున్న ఆర్టీసీకి వసతి సమస్య ఎదురవుతోంది. ప్రత్యేక ప్యాకేజీపై తీసుకెళ్లే వారికి వసతి ఏర్పాటు చేయడం ఆర్టీసీకి ఇబ్బందే. ప్రైవేటు హోటల్స్‌లో వసతి ఏర్పాటు చేస్తే వ్యయం పెరిగి భక్తులు, పర్యాటకుల నుంచి పెద్దగా ఆదరణ ఉండదనేది అధికారుల భావన. ఇందులో భాగంగానే పర్యాటక శాఖ భాగస్వామ్యంతో ప్రత్యేక టూర్లు ఏర్పాటుకు ఆర్టీసీ నిర్ణయించి ప్రతిపాదనలు పంపింది. ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్టు తీసుకొని ప్రయాణించే వారికి పర్యాటక హోటల్స్‌, వసతి గృహాల్లో బస ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చుతో వెళ్లొచ్చనే అభిప్రాయంతో భక్తులు, పర్యాటకుల నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికుల నుంచి రోజు రోజుకూ పెరుగుతున్న డిమాండ్‌ నేపధ్యంలో పర్యాటక శాఖతో సమన్వయం చేసుకొని ప్రత్యేక ప్యాకేజీల ద్వారా వసతి సహా అన్ని ఏర్పాట్లు చేయవచ్చనేది ఆర్టీసీ అధికారుల అభిప్రాయం. ఇదే జరిగితే అటు పర్యాటక శాఖకు, ఇటు ఆర్టీసీకి ఆదాయం కూడా పెరుగుతుందని చెపుతున్నారు.

ఆధ్యాత్మిక పర్యాటకంపై ప్రణాళికలు..

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఆధ్యాత్మిక పర్యాటకం పేరిట పర్యాటక శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. గత ఫిబ్రవరిలో నాలుగు సర్క్యూట్లను ఏర్పాటు చేసినట్లు పర్యాటక శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని ఆలయాలను కలుపుతూ ఏర్పాటు చేసిన సర్క్యూట్లలో దేవదాయశాఖతో సమన్వయం చేసుకొని శీఘ్ర దర్శనం ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం పర్యాటక శాఖ వసతి గృహాలు, హోటల్స్‌ ఉన్న ప్రాంతాలను కలుపుతూ వీటిని రూపొందించారు. భక్తులు బయలు దేరిన తర్వాత తిరిగి తమ గమ్యస్థానాలకు చేరే వరకు ఏ విధమైన ఇబ్బందుల లేని రీతిలో ప్రణాళికలు రూపొందించారు. అయితే కారణాలేంటో తెలియదు కాని ఇప్పటి వరకు ఆ కార్యక్రమం మొదలైనట్లు కూడా లేదు. ఎంతవరకు వచ్చిందనే దానిపై పర్యాటక శాఖ నుంచి స్పందన లేదని చెప్పొచ్చు.

ఆ మూడు శాఖలు కలిస్తే..

ఆర్టీసీ, పర్యాటక, దేవదాయశాఖలు భాగస్వాములైతే పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలను సందర్శించేందుకు అవకాశం ఉంటుంది. అనేక పుణ్యక్షేత్రాలకు సరైన ప్రయాణ సౌకర్యాలు లేక భక్తులు తరుచూ సందర్శించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇదే ఆర్టీసీ కలిస్తే సులువైన రవాణా సౌకర్యం నెలకొంటుంది. ఎలాగూ పర్యాటక శాఖ ఉంటుంది కాబట్టి వసతి సమస్య ఉండనే ఉండదు. మరో వైపు పర్యాటక ప్రాంతాలకు కూడా బస్సు సర్వీసులు పెరగడంతో పాటు పర్యాటకులు రెండు మూడు రోజులు గడిపేందుకు వీలుంటుంది. ఇప్పటికే అధికారుల స్థాయిలు పలుమార్లు వీటిపై చర్చ జరిగినా ప్రతిపాదనలు ముందు కదిలించడంలో జాప్యం జరుగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జాప్యం జరిగేందుకు నెలకొన్న కారణాలను సరిదిద్ధి భక్తులు, పర్యాటకులకు తగిన రీతిలో ప్యాకేజీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement