హైదరాబాద్, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రద్దీ ప్రాంతాలలో ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండేందుకు షామియానాలు వేసి కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, మొబైల్ టాయిలెట్లు అందుబాటులో ఉంచారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి దాదాపు 12 లక్షల మంది ఏపీతో పాటు మహారాష్ట్ర్ర, కర్నాటక వంటి రాష్ట్రాలకు వెళతారని టీఎస్ ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాలకు 4233 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా నిజామాబాద్, కరీంనగర్, మెదక్ వైపు వెళ్లే బస్సులను సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ఖమ్మం, నల్గొండ, విజయవాడ మార్గ్లాలో వెళ్లే బస్సులు ఎల్బీ నగర్ నుంచి, మహబూబ్నగర్, కర్నూలు వైపు వెళ్లే బస్సులు ఆరాంఘర్ నుంచి, హన్మకొండ, వరంగల్, తొర్రూరు వైపు వెళ్లే బస్సులు కేపీహెచ్బి, బీహెచ్ఈఎల్ నుంచి బయలుదేరేలా ఏర్పాట్లు చేశారు.
కాగా, సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు రానుపోను టికెట్లు ముందుగానే టికెట్ బకింగ్ చేసుకుంటే 10 శాతం రాయితీని ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. దీనికి తోడు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకుంటారనీ, ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే రోడ్డు ప్రమాదాలలో చిక్కుకుంటారని ఆర్టీసీ అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దీంతో ప్రయాణికులు భారీ స్థాయిలో ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నారు. ఇదిలా ఉండగా, ఆర్టీసీ బస్సులు దొరకని ప్రయాణికులు సొంత వాహనాలలో వెళుతుండగా, మరికొందరు తమ సొంత వాహనాలను (వైట్ ప్లేట్) ఆయా ప్రాంతాలకు నడిపేందుకు ప్రైవేటు ఆపరేటర్లకు అద్దె ప్రాతిపదిక ఇస్తున్నారు.
ఇలాంటి వారిపై సైతం ఆర్టీసీ అధికారులు నిఘా ఉంచారు. సొంత వాహనాలలో ప్రయాణికులను తరలించే వారిని ఆర్టీసీ అధికారులు పట్టుకుని రవాణా శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు. మరోవైపు, ఆర్టీసీ బస్సులలో సీట్లు దొరకని ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ఆపరేటర్లు అందినంత దండుకుంటున్నారు.