Tuesday, November 19, 2024

డొక్కు బస్సులను వదిలించుకునే ఆలోచనలో ఆర్టీసీ.. అద్దె బస్సుల కొనుగోలుకు యత్నం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నిర్వహణపరంగా భారంగా మారిన డొక్కు బస్సులను వదిలించుకునేందుకు టీఎస్‌ ఆర్టీసీ సిద్ధమైంది. 2015లో కొనుగోలు చేసిన 800 బస్సులు కొనుగోలు చేయడం మినహా ఆ తరువాత కొత్త బస్సులను ఆర్టీసీ సమకూర్చుకోలేదు. 2019లో ఆర్టీసీలో సమ్మె జరిగిన సమయంలో ప్రభుత్వం వాటిని పెంచుకునేందుకు అనుమతించింది. దీంతో సంస్థ యాజమాన్యం టెండర్లు పిలవడంతో వాటి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కానీ ఇప్పుడు వాటిలో చాలా బస్సులు నడవడం లేదు. దీంతో క్రమంగా ఉన్న బస్సులు పాతబడి డొక్కుగా మారిపోయాయి. ఆర్టీసీ యాజమాన్యం గత్యంతరం లేక వాటినే మరమ్మత్తు చేసుకుంటూ నెట్టుకుంటూ వస్తున్నది. ప్రస్తుతం కాలం చెల్లిన బస్సులు ఆర్టీసీలో దాదాపు 2500కు పైగా ఉన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఇటీవల వరుసగా రోడ్డు ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. డొక్కు బస్సులు అయిన కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపణలు ఎక్కు పెట్టాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న కాలం చెల్లిన బస్సులను వదిలించుకోవాలన్న ఆలోచనకు ఆర్టీసీ వచ్చింది. మరోవైపు, కొన్ని నెలలుగా గిట్టుబాటు కావడం లేదంటూ అద్దె బస్సుల నిర్వాహకులు క్రమంగా వైదొలగుతూ వస్తున్నారు. ఈ విధంగా ఇప్పటికే దాదాపు 600 బస్సులు ఆర్టీసీ నుంచి నిష్క్రమించాయి. ఇంకా చాలా మంది యజమానులు వాటిని విరమించుకునే యత్నంలో ఉన్నారు. ఆరు, ఏడు ఏళ్లు నడచిన వారు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు విద్యా సంస్థలు, ఇతర సంస్థలకు అమ్ముకుంటున్నారు.

- Advertisement -

కాగా, కొత్త బస్సులను కొనాలంటే ఆర్టీసీ రూ.35 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తుంది. అద్దె బస్సుల యజమానులు విద్యా సంస్థలకు రూ. 8 లక్షలకు విక్రయిస్తున్న బస్సులను తక్కువ ధరలో కొని వాటిని మరమ్మత్తు చేసుకుంటే కలసి వస్తుందన్న ఆలోచనలో ఆర్టీసీ అధికారులు ఉన్నారు. తక్కువ ధరలో అద్దె బస్సులను కొని సొంత వర్క్‌ షాపులో మెరుగుపరిస్తే కనీసం ఏడెనమిది ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు బావిస్తున్నారు. అద్దె బస్సుల కొనుగోలు నిర్ణయం ఎంత వరకు సరైందనేది తేల్చేందుకు ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులు ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు.ఈలోపు ఎన్ని అద్దె బస్సులు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయనే వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు, 675 కొత్త బస్సుల కొనుగోలు కోసం ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం టెండర్ల ప్ర్రక్రియను పూర్తి చేసింది. వచ్చే ఏడాది మార్చి వరకల్లా అవి అందుబాటులోకి వస్తాయి. అయినప్పటికీ అవి ప్రస్తుతం ఉన్న కొరతను తీర్చలేవు. ఈ నేపథ్యంలో అద్దె బస్సుల కొనుగోలుపై ఆర్టీసీ దృష్టి సారించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement