అమరావతి, ఆంధ్రప్రభ : మరో బృహత్తర కార్యక్రమానికి ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేక సర్వీసులను నడపనుంది. రాష్ట్రంలో ప్రయాణికులకు చేరువయ్యేందుకు ఆర్టీసీ పలు వినూత్న కార్యక్రమాలతో ముందుకెళుతోంది. ప్రత్యేక పర్వదినాలు, సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండుగల సమయంలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా డిమాండ్ మేరకు స్పెషల్ సర్వీసులు నడుపుతోంది.
పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు ప్రయాణికుల కోరిక మేరకు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ తరహా కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. ఆర్టీసీ సేవలు ఎక్కడ అవసరం ఉందో గుర్తించి అందుకు అనుగుణంగా సర్వీసులు నడిపేలా క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
గతంలో ప్రత్యేక సర్వీసుల్లో టిక్కెట్టు ధరలు సాధారణ సర్వీసుతో పోల్చితే 50శాతం అదనంగా ఉండేవి. ఇది ప్రయాణికులకు భారంగా ఉంటుందనే ఉద్దేశంతో రెండేళ్లుగా అదనపు చార్జీలు లేకుండానే ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. తద్వారా ప్రయాణికులకు చేరువ కావడంతో పాటు ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) పెంపు.. ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరడం జరుగుతోంది.
ఈ క్రమంలోనే శబరిమల ప్రయాణికుల కోసం ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఎండీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఈ తరహా సర్వీసులు పరిమిత సంఖ్యలో మాత్రమే ఆయా రీజియన్ల అధికారులు నడిపేవారు. ఇప్పుడు వీటిని విస్తృతం చేసి భక్తులకు సరిపడా సిద్ధం చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
శబరిమలకు ప్రత్యేక సర్వీసులు..
రాష్ట్రంలోని శబరిమల భక్తులు ఏటా పెరుగుతున్నారు. శబరిమల భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నప్పటికీ.. ప్రయాణికుల అవసరాలు తీరడం లేదు. నెలల ముందుగానే అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ చేసేందుకు సైతం సీట్లు అందుబాటులో ఉండటం లేదు. సరిగ్గా ఆర్టీసీ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టిసారించారు. శబరిమలకు ప్రత్యేక సర్వీసులు నడపడం ద్వారా ప్రయాణికుల అవసరాలు తీరడంతో పాటు ఆర్టీసీకి అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. ఐదు, ఆరు, ఏడు రోజుల చొప్పున ప్యాకేజీలు రూపొందిస్తున్నారు.
రీజియన్ల వారీగా..
ప్రత్యేక బస్సులు రీజియన్ల వారీగా ఏర్పాటు చేయనున్నారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని డ్రైవింగ్‌లో విశేష అనుభవం కలిగిన డ్రైవర్లను ప్రయాణికులతో పంపుతారు. రీజియన్‌లో అయ్యప్పస్వామి భక్తుల కోరిక మేరకు వివిధ రకాల బస్సులను ఏర్పాటు చేస్తారు. అమరావతి, ఇంద్ర, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఆల్ట్రా డీలక్స్ బస్సులను ప్రత్యేక సర్వీసులుగా నడపనున్నారు. బస్సులను బట్టి ప్యాకేజీలు ఉంటాయి.
విశాఖలో ఇప్పటికే..
విశాఖ రీజియన్ అధికారులు ఇప్పటికే శబరిమల అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీలు ప్రకటించినట్లు తెలిసింది. ఐదు రోజులు ప్యాకేజీలో భాగంగా విశాఖలో బయలుదేరి విజయవాడ, మేల్ మర ఒత్తూరు, ఎరిమేలి, పంబ, సన్నిధానం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీపురం, కాణిపాకం, తిరుపతి, విజయవాడ నుంచి విశాఖ చేరుకుంటుంది.
సూపర్ లగ్జరీ బస్సుకు రూ.6,600, అల్ట్రా డీలక్స్‌కు రూ.6,550 ఒక్కొక్క స్వామికి టిక్కెట్టు ధర నిర్ణయించారు. ఆరు రోజుల టూరు ప్యాకేజీలో విశాఖ నుంచి యాత్ర మొదలై విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవాని, పలని, ఎరిమేలి, పంబ, ఆనంకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి, కాళహస్తి, అన్నవరం నుంచి విశాఖ చేరనుంది.
ఏడు రోజుల యాత్రలో భాగంగా సూపర్ లగ్జరీ టిక్కెట్టు రూ.7000, అల్ట్రా డీలక్స్ రూ.6900గా నిర్ణయించినట్లు తెలిసింది. ఏడు రోజుల యాత్రలో భాగంగా విశాఖ నుంచి విజయవాడ, కాళహస్తి, బెంగళూరు, మైసూరు, గురువారాయి, ఎరిమేలి, పంబ, సన్నిధానంకు చేరుకుంటు-ంది. ఇదే క్రమంలో ఇతర రీజియన్ల అధికారులు కూడా అయ్యప్ప స్వాముల కోసం టూర్ ప్యాకేజీలు రూపొందిస్తున్నట్లు తెలిసింది.
అరుణాచలం బస్సులకు ఆదరణ..
ప్రతి నెలా పౌర్ణమి రోజున తమిళనాడులోని అరుణాచలం పుణ్యక్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళుతుంటారు. గతంలో తమిళనాడు సరిహద్దు జిల్లాల నుంచి మాత్రమే భక్తులు వెళ్లగా.. గత రెండేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత సంఖ్యలో వెళుతున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకొని ప్రతి రీజియన్ నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు.
అరుణాచలం బస్సులకు ఆయా జిల్లాల్లో మంచి డిమాండ్ ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. నేరుగా సొంత ప్రాంతం నుంచి వెళ్లి వచ్చే అవకాశాలు ఆర్టీసీ ఏర్పాటు చేస్తున్న నేపధ్యంలో రిస్క్‌తో కూడిన ప్రయాణాలకు స్వస్తిపలికి ప్రత్యేక సర్వీసులకు భక్తులు మొగ్గు చూపుతున్నారు. మరో వైపు రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు సైతం ఆర్టీసీ ఆయా పర్వదినాల్లో ప్రత్యేక బస్సులు నడుపుతోంది.