Wednesday, October 9, 2024

TG | మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మహిళా సంఘాలను ఆర్దికంగా బలోపేతం చేసే దిశలో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ద్వారా బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క నేతృత్వంలో కార్యాచరణను వేగంగా సిద్దం చేస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్‌ వస్తున్న నేపథ్యంలో.. మహిళా సంఘాలకు ఉపాధి కల్పిస్తూ వారి ద్వారా కొనుగోలు చేసిన బస్సులను హైర్‌ చేసుకోవాలని టీజీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించాలని నిర్ణయించింది.

ఇప్పటికే మంత్రి సీతక్క నేతృత్వంలో మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సుల కేటాయింపు విధి విధానాలపై చర్చలు పూర్తయ్యాయి. సీఎం సొంత జిల్లా మహబూబ్‌ నగర్‌, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సొంత జిల్లా కరీం నగర్‌లలో తొలి విడత కింద ఆర్టీసీ అద్దె బస్సులను మహిళా సంఘాలకు కేటాయించనున్నారు.

మొదటి విడతలో 100 నుంచి 150 బస్సులను మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయబోతున్నారు. మహిళా సంఘాలు కొనుగోలు చేసే ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ బాద్యతల కోసం ప్రత్యేక వ్యవస్థ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ, ఆర్టీసీ నిర్ణయించాయి. ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు అయ్యే ఖర్చు, వచ్చే ఆదాయం, నిర్వహణ ఖర్చు తదితర అంశాలన్నింటితో కూడిన సమగ్ర నివేదికను సిద్దం చేసి ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

అద్దె బస్సులను మహిళా స్వయం సహాయక సంఘాలకు కేటాయించి ఆ సంఘాలతో ఆర్టీసీ కార్పొరేషన్‌ ఒప్పందం చేసుకోనుంది. ఈ విషయమై మంగళవారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మంత్రి సీతక్క గామీణాభివృద్ధి, ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించే అంశానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌లను సిద్ధం చేయాలని ఇరుశాఖల అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement