హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని అందాల జలపాతాలను, కనువిందు చేసే ప్రకృతి దృశ్యాలను చూడాలని ఉబలాటంగా ఉందా? అందుకు తగిన రవాణా సౌకర్యాల కోసం వెతుకుతున్నారా? అయితే… ఇక ఆ చింత అవసరం లేదు. ఎందుకంటే… ప్రకృతి ప్రేమికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) తగిన ఏర్పాట్లు చేసింది. టీఎస్‌ఆర్టీసీ చైర్మన్, బాజిరెడ్డి గోవర్దన్ శుక్రవారం ఈ వివరాలను వెల్లడించారు. ఆయా ప్రాంతాల పర్యటనలకు సంబంధించి అందించనున్న సర్వీసులకు ప్రత్యేక ప్యాకేజీలను సంస్థ ప్రకటించింది. వివరాలిలా ఉన్నాయి..
రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు పోచంపాడు, పొచ్చెర, కుంటాల జలపాతాలకు నడవనున్నాయి. నిజామాబాద్ ప్రధాన బస్టాండ్ సహా నిర్మల్ బస్టాండ్ నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాలకు చెందిన పర్యాటకులకు ఈ సర్వీసులు తగిన సేవలు అందిస్తాయని సంస్థ వర్గాలు ఈ సందర్భంగా పేర్కొన్నాయి. పర్యాటక ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేయడంతోపాటు ప్రకృతి ప్రేమికులకు మరింత అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఈ సర్వీసులు ప్రారంభించినట్లు గోవర్దన్ పేర్కొన్నారు. ఎంజీబీఎస్(55, 56 ప్లాట్‌ఫారంలు) నుంచి ఉదయం ఐదు గంటలకు బయలుదేరనున్న ఈ సర్వీసులు… పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదకరమైన ప్రయాణానుభూతిని అందిప్తాయని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇక జేబీఎస్ నుండి ఉదయం 5.30 గంటలకు (ప్లాట్‌ఫారం నెం.20) బయలుదేరే ఈ సర్వీసులు… తూప్రాన్, పోచంపాడు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల మీదుగా ప్రయాణిస్తాయి. పొచ్చేరా, కుంటాల చేరుకుంటాయి. ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో భాగంగా… రాత్రి 10.45 గంటలకు హైదరాబాద్ చేరుకుంటాయి. పెద్దలకు రూ.1,099, పిల్లలకు రూ.599 చొప్పున ఈ ప్యాకేజీ ధరలను నిర్ణయించారు.
ఇక నిజామాబాద్ ప్రధాన బస్‌స్టేషన్ నుంచి ప్రతి ఆదివారం ఉదయం 8గంటలకు ఈ ప్రత్యేక సర్వీసులు ప్రారంభమవుతాయి. నిజామాబాద్ నుంచి పొచ్చెెర జలపాతానికి, అక్కడి నుండి కుంటాల జలపాతానికి ప్రయాణిస్తాయి. సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ తిరుగు ప్రయాణమవుతాయి. నిర్మల్ బస్టాండ్ నుండి కుంటాల జలపాతం వరకు బసప్సు సర్వీసులను ఇప్పటికే ప్రారంభించినట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఇందుకు సంబంధించి పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.110గా నిర్ణయించారు.