Friday, November 22, 2024

అద్దెకు ఆర్టీసీ బస్టాండ్‌లు.. ఖాళీ స్థలాల్లో ఫంక్షన్‌ హాల్స్‌, షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లకు ప్రతిపాదనలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నష్టాల బాట నుంచి గట్టెక్కే దిశగా అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీఎస్‌ ఆర్టీసీ భావిస్తోంది. ఇప్పటికే కార్గో సేవలను ప్రారంభించి ప్రజలకు సరుకు రవాణా చేయడం ద్వారా ఆర్టీసీ చెప్పుకోదగ్గ రీతిలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. అలాగే, వివాహాలు, పండుగల సీజన్‌లో ఆకర్షణీయ పథకాలతో ప్రజలను ఆర్టీసీ భాగస్వాములను చేస్తూ ఆదాయం పొందుతున్నది. తాజాగా మరో అడుగు ముందుకు వేసి ప్రయాణికులు ఎక్కువగా రాని బస్టాండ్‌లు, శిథిలావస్తకు చేరిన బస్టాండ్‌లను అద్దెకు ఇవ్వాలని యోచిస్తున్నది. ఈ మేరకు వివరాలు పంపాలని ఆయా జిల్లాల ఆర్‌ఎంలు, డీఎంలకు టీఎస్‌ ఆర్టీసీ ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల బస్‌ స్టేషన్లు వృధాగా పడి ఉంటున్నాయి. గ్రామాల మధ్యలో రోడ్డు పక్కనే ఉన్నప్పటికీ ప్రయాణికులు రాక వెలవెలబోతున్నాయి.

లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన బస్‌ స్టేషన్లు, అందులో నిర్మించిన గదుల వల్ల ప్రయోజనం ఉండటం లేదు. దీంతో ఆర్టీసీకి భారీ మొత్తంలో నష్టం వాటిల్లుతున్నది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్‌లలోని ఖాళీ స్థలాన్ని వాణిజ్య కార్యకలాపాల కోసం సంస్థలకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. ఖాళీ స్థలం అందుబాటును బట్టి ఫంక్షన్‌ హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు, హోటళ్లు వంటి వాణిజ్య అవసరాలకు అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల డిపో మేనేజర్లు, ఆర్‌ఎంలు బస్‌ భవన్‌ ఉన్నతాధికారులకు నెల రోజుల క్రితమే ప్రతిపాదనలు పంపారు.

- Advertisement -

కొన్ని బస్‌ స్టేషన్లలో వాటి పరిధిలోని ఖాళీ స్థలాలు, మరికొన్ని బస్‌ స్టేషన్లలో లేకుంటే బయట ఏర్పాటు చేసుకునేందుకు కూడా ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే మరో 15 రోజుల్లో రాష్ట్ర్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న బస్టాండ్‌లలోని ప్రాంతాలలో వాణిజ్య సంస్థలకు అద్దెకు సంబంధించి బహిరంగ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాగా, రాష్ట్ర్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రయాణికుల ప్రాంగణాల్లో పెట్రోల్‌ బంక్‌ల ఏర్పాటుకు ఆర్టీసీ నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఆమోదించడం కూడా జరిగింది. దీంతో ఇప్పటికే కొన్ని బస్‌ స్టేషన్లలో పెట్రోల్‌ బంకులు మంజూరు కాగా, పనులు కూడా కొనసాగుతున్నాయి.

ఖాళీ స్థలాలు అద్దెతో ఆర్టీసీకి భారీ ఆదాయం

రాష్ట్ర్రవ్యాప్తంగా బస్‌స్టేషన్లలో ఖాళీగా పడి ఉన్న ప్రాంతాలను వాణిజ్య సంస్థలకు అద్దెకు ఇవ్వడం ద్వారా టీఎస్‌ ఆర్టీసీకి భారీ మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశం ఉందని రంగారెడ్డి రీజనల్‌ మేనేజర్‌ శ్రీధర్‌ అన్నారు. ఆయా బస్‌ స్టేషన్లు, సమీపంలో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాన్ని బట్టి షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు, హోటళ్లు, ఫంక్షన్‌ హాల్స్‌కు ఇచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామనీ, మరో 15 రోజుల్లో ఆమోదం వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement