హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఈనెల 28న రథ సప్తమి పర్వదినం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు 80 ప్రత్యక బస్సులు నడుపనున్నట్లు టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి విసి సజ్జన్నార్ తెలిపారు. రాజధాని హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల నుంచి వేములవాడ, ధర్మపురి, యాదగిరిగుట్ట, మన్నెంకొండ, గూడానికి ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు తెలిపారు. కరీంనగర్ నుంచి వేములవాడకు 10, ధర్మపురికి 10, నల్లగొండ నుంచి యాదగిరిగుట్టకు 10, మహబూబ్‌నగర్ నుంచి మన్నెంకొండకు 10, ఆదిలాబాద్ నుంచి గూడెంకు 5, హైదరాబాద్ కేపీహెచ్‌బి నుంచి అనంతగిరికి 5 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు పేర్కొన్నారు.
అలాగే, హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ పెద్దమ్మ తల్లి, చిలుకూరు బాలాజి, సికింద్రాబాద్ మహాంకాళి, హిమాయత్‌నగర్ బాలాజీ తదితర ఆలయాకు నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి 20 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామనీ, రథసప్తమి సందర్భంగా ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందనీ, ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాగా, గురువారం వసంత పంచమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరకు, వర్గల్‌కు 108 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా బాజిరెడ్డి, సజ్జన్నార్ వెల్లడించారు.