హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఈనెల 26న వసంత పంచమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ 108 ప్రత్యేక బస్సులను నడుపనుంది. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరకు 88 బస్సులు, సిద్దిపేట జిల్లాలోని 20 ప్రత్యేక బస్సులను నడుపనుంది. బుధ, గురు వారాల్లో ఈ బస్సులు తిరుగుతాయి. బాసరకు హైదరాబాద్ ఎంజిబిఎస్ నుంచి 21, జేబీఎస్ నుంచి 12, నిజామాబాద్‌నుంచి 45, హన్మకొండ నుంచి 5, జగిత్యాల నుంచి 4 బస్సులను ఏర్పాటు చేసింది. అలాగే, వర్గల్‌కు సికింద్రాబాద్ నుంచి ప్రతీ అరగంటకో బస్సు, జేబీఎస్ నుంచి 6, గజ్వేల్, సిద్దిపేట నుంచి 2 బస్సులను నడుపుతున్నారు.
కాగా వసంత పంచమి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బాసర, వర్గల్‌కు 108 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జన్నార్ తెలిపారు. ఈ ప్రత్యేక బస్సు సర్వీసులను ఉపయోగించుకుని ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. ఈ ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలను టీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఈ సందర్భంగా బాజిరెడ్డి, సజ్జన్నార్ కోరారు.