సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కంపెనీ ప్రమాద బీమా కల్పించనుంది. ఈ మేరకు చైర్మన్, ఎండీ ఎన్.బలరాం ప్రకటించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.30 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. సింగరేణి భవన్ లో మంగళవారం సాయంత్రం ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమంపై సంస్థ డైరెక్టర్లు, ఏరియా జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబ సభ్యుల సామాజిక, ఆర్థిక భద్రత చర్యల్లో భాగంగానే ఈ ప్రమాద బీమా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రమాద బీమా వర్తించాలంటే ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగికి HDFC బ్యాంక్‌లో జీతం ఖాతా ఉండాలని… ఈ విషయమై సంబంధిత కాంట్రాక్టర్ల ద్వారా వారికి అవగాహన కల్పించాలని ఏరియా జీఎంలను ఆదేశించారు.
ఇక, ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా సింగరేణి ఉద్యోగులకు ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంకుల ద్వారా కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. అలాగే కాంట్రాక్టు కార్మికుల సంక్షేమానికి HDFCతో ఒప్పందం చేశామని… కాంట్రాక్టు కార్మికులకు 30 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తింపజేసేందుకు కృషి చేశామన్నారు. అలాగే ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.50 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం వర్తింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
సింగరేణి ఆస్పత్రుల్లో కాంట్రాక్టు కార్మికులకు వైద్యసేవలు అందిస్తున్నామని, అయితే వారి కుటుంబ సభ్యులు, పిల్లలకు కూడా ఆరోగ్య సేవలు అందించే విషయమై ఈఎస్‌ఐ (ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్) ఆస్పత్రుల ఉన్నతాధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయన్నారు. ముందుగా కొత్తగూడెం, సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్‌టీపీపీ)లోని ఈఎస్‌ఐ ఆసుపత్రుల ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు.
కాంట్రాక్టు ఉద్యోగుల జీతం, పీఎఫ్, సీఎంపీఎఫ్ చెల్లింపులు సకాలంలో జరిగేలా మస్టర్లను వెబ్ అప్లికేషన్ ద్వారా నమోదు చేసే ప్రక్రియ కూడా జరుగుతోందని వివరించారు. వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ ప్రక్రియను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో వారి మస్టర్ల నమోదు ఆధారంగా, జీతాలు, PF , CMPF చెల్లింపులు సంక్రమంగా జరిగి వారి ఖాతాల్లోకి జమ చేసే వీలుంటుందన్నారు. ఈ సమావేశంలో కొత్తగూడెం నుంచి డైరెక్టర్లు డి.సత్యనారాయణరావు (ఇఅండ్‌ఎం), ఎన్‌వికె శ్రీనివాస్ (ఆపరేషన్స్, పర్సనల్), జి.వెంకటేశ్వరరెడ్డి, కార్పోరేట్ జిఎంలు, సింగరేణి భవన్ నుంచి జీఎం(కో ఆర్డినేషన్) జి. దేవేందర్ పాల్గొన్నారు.