ఏపీఏ పరిధిలోని ఏఎల్పీ గనిలో జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డ వీటీసీ ట్రైనీ తోట శ్రీకాంత్ కుటుంబానికి రూ.30 లక్షల నష్ట పరిహారం చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం ఆంగీకరించింది. ఈనెల 7న జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు స్వల్పగాయాలతో బయటపడగా, ఇద్దరు అధికారులతో పాటు వీటీసీ ట్రైనీ తోట శ్రీకాంత్ లు మృత్యువాత పడ్డారు. అధికారులకు సంబంధించి వారి కుటుంబాలకు రావాల్సిన ఫిక్స్ డ్ బెనిఫిట్స్ వారికి అందుతాయని వారి కుటుంబ సభ్యులు పోస్ట్ మార్టం పూర్తి చేసుకుని వారి స్వగ్రామం తీసుకువెళ్లగా, వీటీసీ ట్రైనీ తోట శ్రీకాంత్ కుటుంబానికి నష్టపరిహారం ఎవరు చెల్లించాలనే విషయంగా గందరగోళం నెలకుంది. ఈ పరిస్థితుల్లో గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి చేరుకున్న పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ బాధిత కుటుంబానికి అండగా నిలిచి అన్ని యూనియన్ల నాయకులను ఏకతాటిపైకి తీసుకు వచ్చి సింగరేణి అధికారులను చర్చలకు పిలిచారు. ముందు తమకేం సంబంధం లేదని బుకాయించిన సింగరేణి అధికారులు జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మరియు కార్మిక నాయకులు ఒక్కో అంశంపై నిలదీయడంతో తర్జన భర్జన పడ్డారు. ఒకదశలో సింగరేణి అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను కోరడంతో అధికారులు తీవ్ర చర్చల అనంతరం రూ.30లక్షల నష్టపరిహారం చెల్లించేందుకు, అదే విధంగా ఇంట్లో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చేందుకు ఆంగీకరించారు.
త్రిశంఖు స్వర్గంలో చిక్కుకున్నట్లుగా ఉన్న వీటీసీ ట్రైనీ మృతికి ఎవరు బాధ్యులనే విషయంగా ఎదురైన సమస్యకు జిల్లాపరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాల సహకారంతో పరిష్కారం లభించినట్లయింది. సింగరేణిలో జరిగిన పలు ప్రమాదాల్లో ఔట్ సోర్సింగ్ కార్మికులకు నష్టపరిహారం ఇప్పించే విషయంలో ఆయా ఓబీ, ప్రైవేట్ కాంట్రాక్టర్లను బాధ్యులను చేస్తూ వారి బిల్లుల్లో నుండి మినాహాయించికుని సింగరేణి సంస్థ బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు చొరవ తీసుకోగా, వీటీసీ ట్రైనీ మృతికి ఎవరిని బాధ్యులను చేయాలనేది సింగరేణి అధికారులకు సైతం అంతుచిక్కలేదు.
ఎట్టకేలకు జిల్లాపరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ మరియు కార్మిక సంఘాల నాయకుల ఒత్తిడితో రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించేందుకు సింగరేణి పర్సనల్ జీఎం ఆనందరావ్, ఆర్జీ-3 జీఎం మనోహర్, ఎస్వోటూ జీం బైద్యలు ఒప్పందం చేసుకున్నారు. సింగరేణి చరిత్రలో ప్రప్రథమంగా జరిగిన వీటీసీ ట్రైనీ మృతి విషయంలో పరిష్కారం చూపిన జిల్లాపరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ మరియు కార్మిక సంఘాల నాయకులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..