Saturday, November 23, 2024

సాగునీటి రంగానికి రూ.22,691 కోట్లు, పాలమూరు-రంగారెడ్డి కి ఇంపార్టెన్స్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈ ఏడాది బడ్జెట్‌లో సాగునీటిపారుదల రంగానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆర్థికశాఖా మంత్రి హరీష్‌రావు తెలిపారు. సోమవారం బడ్జెట్‌ ప్రవేశపెట్టి ప్రసంగించారు. సాగునీటిరంగానికి రూ.22, 691 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో మిషన్‌ కాకతీయకార్యక్రమాన్ని పూర్తి చేశామన్నారు. చెరువులన్నింటినీ నదులతో అనుసంధానం చేశామన్నారు. ఇప్పటికే నదులపై 1200 చెక్‌ డ్యాంఎలు నిర్మించామని, రెండో విడతలో మరో 650 చెక్‌డ్యాంలను ఈ ఏడాదిలో నిర్మించనున్నట్లు వివరించారు. పాలమూరు ప్రాంత పరిధిలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులో 70శాతం పనులు పూర్తయ్యాయని, ప్రాజెక్టుకు నిధుల కొరత రాకుండా కాళేశ్వరం కార్పోరేషన్‌తో అనుసంధానం చేసినట్లు వివరించారు. ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్‌, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్‌ రిజర్వాయర్ల పంప్‌హౌజ్‌ పనుల పురోగతిలో ఉన్నాయన్నారు. రూ.6190 కోట్లతో నల్గొండ జిల్లాలోని కరువు ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండతోపాటు అచ్చంపేట, కల్వకుర్తిలోని అయిదు మండలాల్లో 3.41లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నామన్నారు.

పలు ఎత్తిపోతల పథకాలకు త్వరలోనే టెండర్ల ను పిలవనున్నట్లు చెప్పారు. సమ్మక్క సారక్క బ్యారేజీ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. దేవాదుల ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు సమృద్ధిగా నీరు అందనుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవటంతోపాటు అతిపెద్ద రిజర్వాయర్‌ మల్లన్నసాగర్‌ పూర్తవటం సాగునీటిరంగ చరిత్రలో మహాద్భుతమన్నారు. ప్రాజెక్టులపై ప్రతికూల శక్తులు ఎన్ని కేసులు వేసినా సీఎం కేసీఆర్‌ మొక్కవోని దీక్షతో ముందుకు వెళుతున్నారని చెప్పారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలతో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, సంగారెడ్డి, ఆందోల్‌ నియోజకవర్గాలు సస్యశ్యామలం కానున్నాయన్నారు. కృష్ణ జలాల్లో తెలంగాణ వాటా తేల్చేందుకు అంతర్‌ రాష్ట్ర నదీ జలాల వివిదచట్టం సెక్షన్‌ 3 కింద ట్రిబ్యునల్‌ వేయాలని కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవటం లేదన్నారు. పైగా తెలంగాణ ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తెచ్చిందన్నారు. రాష్ట్రానికి అనుకూలమైనదానిని చేయని కేంద్రం ప్రతికూలమైనదానిని మాత్రం వెంటనే చేస్తోందన్నారు. గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్‌లకు ఆమోదం తెలపని కేంద్రం… గోదావరి-కావేరి అనుసంధానం గురించి మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరు మోకాలడ్డినా సీఎం కేసీఆర్‌ సంకల్పం చెక్కు చెదరదని, రాష్ట్రంలోని కోటి ఎకరాలను మాగాఢంగా మారుస్తుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement