Saturday, November 23, 2024

ప్ర‌తీ గ్రామ స‌చివాల‌యానికీ రూ.20 ల‌క్ష‌లు- మంత్రి ధర్మాన ప్రసాదరావు

ప్ర‌తీ గ్రామ స‌చివాల‌యానికి ఇర‌వై ల‌క్ష‌ల రూపాయ‌లు మంజూరు చేస్తున్నామ‌ని, వీటిని వినియోగించుకుని సంబంధిత అభివృద్ధి ప‌నులు త‌క్ష‌ణ అవ‌స‌రాలను దృష్టిలో ఉంచుకుని చేప‌ట్టాల‌ని రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు వెల్ల‌డించారు. శ్రీకాకుళం మండలం, భైరి గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేళ్ల కిందట ఎన్నికలు జరిగినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని మీ అందరికీ విన్నవించాను. మా పార్టీకి ఓటేస్తే ఏయే కార్యక్రమాలు అమలు చేస్తామో అన్నది కూడా మ్యానిఫెస్టో రూపంలో మీ అందరికీ వివరించాను. అలానే మీరు ఓటు వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నన్ను కూడా గెలిపించారు. పాలన పగ్గాలు అందుకుని మూడేళ్లయింది. మూడేళ్ల కాలం అంటే ఓ ప్రభుత్వం పనిచేస్తున్న తీరును అర్థం చేసుకునేందుకు, అంచనా వేసేందుకు సరైన సమయం.

ఓ ప్రభుత్వం అధికారంలో ఉండే ఐదేళ్ల కాలానికి గాను మూడేళ్ల కాలం పూర్తవ్వడం అంటే నిజంగానే ఇదొక కీలక సమయం.అందుకే మిమ్మల్ని కలిసేందుకు ఇక్కడికి వచ్చాను. మీకు ఆనాడు చెప్పిన మాటలు అన్నీ అమల్లోకి వచ్చాయా లేదా ఆచరణాయుతం అయ్యాయా అని తెలుసుకునేందుకే ఈ గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం. అందుకే మీకు అందుతున్న పథకాలు, వాటి తీరుతెన్నులు తెలుసుకున్నాకే నేను ఇచ్చిన మాటలు అన్నీ నిలబెట్టుకున్నాకే మళ్లీ మీ దగ్గరకు ఓటు అడిగేందుకు వస్తాను. ఏ విధంగా చూసుకున్నా మహిళల గౌరవాన్ని పెంచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం.. ఆ సంగతి మీరు మరిచిపోకూడదు. అదేవిధంగా గ్రామంలో విద్యుత్ సరఫరా కు సంబంధించి సమస్య ఉందని నా దృష్టికి తెచ్చారు. ఇందుకోసం కొత్త లైన్ మంజూరుకు ఎనిమిది లక్షల రూపాయలు తక్షణమే కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించాన‌ని చెప్పారాయన.

యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ, గత ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తేడాను వివరించారు. ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య దళారీ వ్యవస్థ లేకుండా, మధ్యవర్తులు, లంచాలు లేకుండా, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలును అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి నిర్మల శ్రీనివాసరావు, ఎంపిడివో వెంకట్ రామన్, ఎమ్మార్వో వెంకటరావు, సర్పంచ్ ఇందుమతి, ఎఎంసి చైర్మన్ ముకళ్ల తాతబాబు, వైస్సార్సీపీ నాయకులు అంబటి శ్రీనివాసరావు, చిట్టి జనార్ధనరావు, ఎచ్చెర్ల శ్రీధర్, చల్లా రవికుమార్, మోహన్, సర్పంచులు, ఎంపిటిసిలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement