Wednesday, November 20, 2024

TG | ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ… : సీఎం రేవంత్ రెడ్డి

వ్యవసాయం అంటే దండగ కాదు పండగ చేయటమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని.. అందుకోసం రైతుకు పంట రుణమాఫీ చేసేందుకు తమ మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం (జూన్ 21న) మంత్రివర్గ సమావేశం అనంతరం.. సీఎం రేవంత్ రెడ్డి మీడియోతో మాట్లాడారు…

ఏకకాలంలో రుణమాఫీ..

అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్‌లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన రైతు డిక్లరేషన్‌కు అనుగుణంగా అన్నదాతలకు ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాగా, ఈ రుణమాఫీతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని.. తాము నిర్ణయించుకున్న తుది గడువు (ఆగస్టు 15వ తేదీ)లోపు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

రుణమాఫీ కటాఫ్ తేదీ..

బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో మొదటిసారి రూ.16 వేల కోట్లు, 2018లో రెండో సారి రూ.12వేల కోట్లు రుణమాఫీ చేసిందని రేవంత్ రెడ్డి వివరించారు. అయితే అప్పటి సర్కార్ 2018 డిసెంబరు 11 కటాఫ్‌ తేదీగా నిర్ణయించిందని తెలిపిన రేవంత్ రెడ్డి.. తన ప్రభుత్వం 2018 డిసెంబర్ 12 నుంచి మొదలు పెట్టి 2023 డిసెంబరు 9 వరకు కటాఫ్ తేదీగా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలోని రైతులు తీసుకున్న రూ.2లక్షల మేర రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

రైతు భరోసాకు మరింత సమయం..

ఇదిలా ఉంటే.. రైతు భరోసా పథకం అమలుపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా పథకంపై మంత్రివర్గ ఉపసంఘం వేశామని ముఖ్యమంత్రి తెలిపారు. జులై 15లోపు ఉపసంఘం నివేదిక ఇస్తుందని.. ఆ రిపోర్ట్ ఆధారంగానే రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. కేవలం కేబినెట్‌‍ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోకుండా.. ఆసెంబ్లీలో చర్చించి.. అందరి దగ్గరి నుంచి ప్రతిపాదనలు తీసుకున్న తర్వాతే తుది నిర్ణయానికి వస్తామని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement