తెలంగాణలో ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత, తాత్కాలిక అంగ వైకల్యం పొందిన కల్లుగీత కార్మికులకు రూ.13.96 కోట్ల ఆర్థిక సాయాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అందజేశారు. రవీంద్ర భారతి వేదికగా కేసీఆర్ అభయ హస్తం పథకం కింద గీత కార్మికుల కుటుంబాలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్థిక సాయం అందించారు. ప్రమాదవశాత్తు మరణించిన 126 మంది కల్లుగీత కార్మికులకు రూ. 5 లక్షల చొప్పున, శాశ్వత వైకల్యం పొందిన 147 మందికి రూ. 5 లక్షల చొప్పున, తాత్కాలిక అంగ వైకల్యం పొందిన 315 మందికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. మొత్తం 588 మంది కల్లుగీత కార్మికుల కుటుంబాలకు రూ. 13.96 కోట్ల ఆర్థిక సాయం అందించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కల్లుగీత వృత్తిదారులను ఆదుకుంటున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. మరోవైపు హరితహారంలో భాగంగా లక్షల సంఖ్యలో ఈత, తాటి మొక్కలను నాటామని గుర్తు చేశారు. గౌడ వృత్తిదారుల భవనం కోసం కోకాపేట్‌లో రూ. 300 కోట్ల విలువైన స్థలాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారు. ఆ భవన నిర్మాణానికి రాష్ర్ట ప్రభుత్వం రూ. 5 కోట్లు మంజూరు చేసిందన్నారు. నీరా పాలసీని తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కులవృత్తుల వారు ఆత్మగౌరవంతో బతికేలా సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అటు ట్యాంక్‌బండ్‌పై రూ. 20 కోట్లతో నీరా కేఫ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేఫ్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. త్వరలో గౌడ సోదరులకు డిజైన్‌తో కూడిన లూనాలు అందిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఈపీఎఫ్ ఖాతాదారులకు ఊరట