Friday, November 22, 2024

ముంపు బాధితుల‌కు ఇంటికి రూ.10వేలు.. వెయ్యి కోట్లతో కొత్త కాలనీ : సీఎం కేసీఆర్

భ‌ద్రాచ‌లంలోని వ‌ర‌ద ముంపు బాధిత కుటుంబాల‌కు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. వ‌ర‌ద‌ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డుతామ‌న్నారు. అదే విధంగా ముంపున‌కు గుర‌య్యే ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఎత్తైన ప్ర‌దేశంలో రూ.1000 కోట్ల‌తో కొత్త కాల‌నీ నిర్మిస్తామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. భ‌ద్రాచ‌లంలో వ‌ర‌ద ముంపు ప్రాంతాల‌ను ప‌రిశీలించిన అనంత‌రం స్థానికంగా ఉన్న‌ ఐటీడీఏలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. గోదావరి ఉప్పొంగడంతో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల ప్రజలు వరద తాకిడికి ఎక్కువగా గురయ్యాయి. వరదల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జ‌ర‌గ‌లేద‌న్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయడం ప్రశంసనీయమ‌ని, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లను, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల సేవ‌లు అభినంద‌నీయ‌మ‌న్నారు.

భద్రాచలంలో శాశ్వతంగా ముంపు సమస్యను పరిష్కరించాలని నిర్ణయించ‌డం జ‌రిగింద‌న్నారు. వరద ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన కాలనీలను నిర్మిస్తామ‌న్నారు. ఎత్తైన స్థలాల్లో రూ.1,000 కోట్లతో శాశ్వత కాలనీలను నిర్మించాల‌ని కలెక్టర్ ను ఆదేశించ‌డం జ‌రిగింద‌న్నారు. భద్రాచలం పట్టణ కాంటూరు లెవల్స్ ను పరిగణలోకి తీసుకోవాల‌న్నారు. కరకట్ట ప్రాంతాల్లోని ముంపు నివాసాలను కూడా తరలించాలి.. బాధితులకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాల‌న్నారు. శాశ్వత పరిష్కారం కోసం వెయ్యి కోట్ల నిధులను కేటాయిస్తున్నాం అన్నారు. ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా నిరంతరం బ్లీచింగ్ చేయింయాల‌ని హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావుకు ఆదేశించారు. ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక నిధులను అందజేస్తామ‌న్నారు. భద్రాచలం సీతారాముల పుణ్యక్షేత్రాన్ని ముంపు నుంచి రక్షించి, అభివృద్ధి చేస్తామ‌న్నారు. ఇందుకోసం త్వరలోనే మరోసారి భద్రాచలంలో పర్యటిస్తా అన్నారు. మారిన వాతావరణ పరిస్థితుల్లో క్లౌడ్ బరస్ట్ లు జరుగుతున్నాయి. పర్యవసానంగా వరద ముంపు పెరుగుతున్నది. నిరంతరాయంగా కురిసే వర్షాల వల్ల తలెత్తే ఉత్పాతానికి నిదర్శనమే ఈ వరదలు అన్నారు.

కడెం ప్రాజెక్టు దేవుని దయ వల్ల నిలబడింద‌ని, ఈ ప్రాజెక్టుకు నీటి వరద 2 లక్షల 90 వేల క్యూసెక్కులకు మించి దాటలేదు.. కానీ ఇపుడు 5 లక్షలకు మించి పోయినా ప్రాజెక్టు నిలబడింద‌న్నారు. దుమ్మగూడెం చర్ల మండలాల్లో నీటిపారుదలకు సంబంధించిన అంశాలు నా దృష్టికి వచ్చాయ‌న్నారు. మొండికుంట వాగు, పాలెం వాగు బ్యాలెన్స్ పనులను పూర్తి చేస్తామ‌న్నారు. భద్రాచలం, బూర్గంపాడు, పినపాక ప్రాంతాల్లో పలు గ్రామాల్లో వరద సమస్యలు ఉత్పన్నమయ్యాయి.. రైతుల పంటలు నీట మునిగాయి.. సమీక్షించి తగు సహాయం అందిస్తామ‌న్నారు. ఉన‌రావాస కేంద్రాల్లో ఉన్న వారిని పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాతే ఖాళీ చేయించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఒక్కో కుటుంబానికి 20 కిలోల చొప్పున మరో 2 నెలలపాటు ఉచితంగా బియ్యం అందజేస్తామ‌న్నారు. వరద ముంపు బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద రూ.10 వేలు అందజేస్తామ‌న్నారు. ప్రజలంతా మరో 15 రోజులు జాగ్రత్తగా ఉండాలి. రిలాక్స్ కాకూడదు. అలర్ట్ గా ఉండాల‌న్నారు. హైదరాబాద్ నుంచి మేం ఇచ్చిన ఆదేశాలను అనుసరించి ప్రజలను వరదల నుంచి రక్షించి, ప్రాణహాని జరగకుండా కాపాడిన వారందరికీ సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement