దేశ రాజధాని ఢ్లిలీలో ఉంటున్న మహిళలు ఇకపై ప్రతీనెలా రూ. 1,000 అందుకోనున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో సోమవారం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి అతిషి మర్లెనా పలు కీలక ప్రకటనలు చేశారు. ఢిల్లీలో ఉంటున్న 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ప్రతి నెలా రూ.1000 అందజేస్తుందని ప్రకటించారు. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద ఈ మొత్తాన్ని అందజేస్తామని తెలిపారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో అతిషి మర్లెనా మాట్లాడుతూ.. ‘రామరాజ్యంలో తదుపరి అడుగు మహిళల భద్రత. మహిళల అవసరాలను తీర్చడంలో ముందున్నందుకు గర్వపడుతున్నాం. ఉచిత విద్యుత్తు, నీటి బిల్లులు, మొహల్లా క్లినిక్, వృద్ధ మహిళలను తీర్థయాత్రలకు పంపడం మొదలైనవి చేపట్టాం. 2014తో 2024ను పోల్చినప్పుడు మహిళలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించాం’ అని అన్నారు.
ఈ బడ్జెట్‌లో విద్యా రంగానికి రూ.16,396 కోట్లు కేటాయించామని ఆమె తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమని అతిషి అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 9 లక్షల మంది బాలికలు చదువుతున్నారని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 933 మంది బాలికలు నీట్‌లో ఉత్తీర్ణత సాధించగా, 123 మంది బాలికలు జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని ఆమె తెలిపారు.