ముంబై ఇండియన్స్ తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు చెలరేగారు. రాజస్థాన్ రాయల్స్ హోం గ్రౌండ్ జైపూర్ వేదికగా జరుగుతున్నఈ మ్యాచ్ లో ముంబైని అదుపు చేయగలిగారు. అయితే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును తిలక్ వర్మ(65), నేహల్ వధేరా(49)లు ఆదుకున్నారు. దాంతో, పాండ్యా సేన నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగలిగింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ముంబైకి ఆదిలోనే షక్ తగిలింది. తొలి ఓవర్‌లోనే బౌల్ట్ రోహిత్ శర్మ(6)ను ఔట్ చేయగా.. ఆ తర్వాత సందీప్ శర్మ వికెట్ల వేట మొదలెట్టాడు. పేసర్ సందీప్ శర్మ(5/18) సూపర్ స్పెల్‌తో కట్టడి చేశాడు. కీలక బ్యాటర్లైన ఇషాన్ కిషన్(0), సూర్యకుమార్ యాదవ్(10), బౌండరీలతో చెలరేగుతున్న తిలక్ వర్మ (65), టిమ్ డేవిడ్ (3) , గెరాల్డ్ కోయెట్జీ (0) లను సందీప్ వెనక్కి పంపి ముంబైని కష్టాల్లోకి నెట్టాడు.
అయితే, 20 రన్స్‌కే మూడు కీలక వికెట్లు కోల్పోయిన ముంబై జట్టును తిలక్ వర్మ(65), నేహల్ వధేరా (49)లు ఆదుకున్నారు. మొదట్లో ఆచితూచి ఆడి ఆ తర్వాత బౌండరీలతో రెచ్చిపోయారు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా(10), టిమ్ డెవిడ్(3)లు నిరాశపరచడంతో.. రాజస్థాన్ ముందు టార్గెట్ నిర్దేశించగలిగింది.