ఐపీఎల్ 2024 టేబుల్ టాపర్స్ ఫైట్‌కు వరుణుడు అడ్డుగా నిలిచాడు. దీంతో నేడు గువాహటి వేదకిగా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. హోం గ్రౌండ్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో… రాజస్థాన్ జట్టు తలపడాల్సి ఉండగా.. వర్షం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
సాయంత్రం నుంచి చిరుజల్లు కురుస్తున్నా.. రాత్రి కాసేపు వర్షం నిలిచిపోవడంతో కనీసం ఏడు ఓవర్ల మ్యాచ్ ప్రారంభించేందుకు టాస్ కూడా వేశారు. అయితే టాస్ అనంతరం మళ్లీ మళ్లీ వర్షం తిరిగి ఆరంభమవడంతో ఇక మ్యాచ్ జరిగే అవకాశం లేదని తేల్చేసిన అంపైర్లు.. ఇరు జట్లకి చెరొక పాయింట్ ఇచ్చేసి మ్యాచ్‌ని రద్దు చేశారు. దీంతో పాయింట్స్ టేబుల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ కంటే తక్కువ నెట్ రన్ రేట్ ఉండటంతో రాజస్థాన్ 3వ స్థానానికి స్థిరపడింది.
క్వాలిఫయర్స్ షెడ్యూల్ ఇలా !
మంగళవారం (మే 21) జరగనున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (పాయింట్ పట్టికలో 1వ స్థానం) సన్‌రైజర్స్ హైదరాబాద్ (పాయింట్ పట్టికలో 2వ స్థానం) జట్లు తలపడనున్నాయి.
ఇక బుధవారం (మే 22) జరగనున్న ఎలిమినేటర్‌లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ (పాయింట్‌ల పట్టికలో 3వ స్థానం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.