Saturday, November 23, 2024

రూటు మార్చిన వ్యాపారులు, నకిలీ విత్తనాల స‌ప్ల‌య్‌లో డిఫ‌రెంట్ స్టైల్‌

(ప్రభన్యూస్‌బ్యూరో ఉమ్మడిరంగారెడ్డి) : నకిలీ విత్తనాల వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. చిక్కకుండా రోజుకో మార్గం ద్వారా నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారు. పోలీసులు, వ్యవసాయ శాఖ క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తున్నా వీరి వ్యాపారం మాత్రం ఆగడం లేదు…వివిధ రాష్ట్రాలనుండి నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారు…రైళ్లు, ట్రాన్స్‌ఫోర్టు వ్యవస్థను పక్కాగా సద్వినియోగం చేసుకుంటున్నారు…పోలీసులు అన్ని ప్రాంతాల్లో నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎరువుల దుకాణాలు, జాతీయ రహదారుల వెంబడే కాకుండా రైల్వే స్టేషన్లు…ట్రాన్స్‌ఫోర్టు వ్యవస్థపై గట్టి నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సీజన్‌ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాలపై క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తే రైతులకు నకిలీ విత్తనాలు చేసే అవకాశం లేదు…నిఘా వ్యవస్థ లోని లోపాలను వ్యాపారులు సద్వినియోగం చేసుకుంటున్నారు…సరుకు చేరాల్సిన చోటికి చేర్చుతున్నారు…ఇందులో లూజ్‌ సీడ్స్‌తోపాటు ప్యాకెట్లు కూడా ఉంటున్నాయి…

నకిలీ విత్తనాలతో రైతులు ప్రతిసంవత్సరం నష్టపోతూనే ఉన్నారు. నకిలీ విత్తనాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నా ప్రతి సంవత్సరం కేసులు పెరుగుతూనే ఉన్నాయి తప్పిస్తే ఏమాత్రం తగ్గడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా పోలీసులు, వ్యవసాయ శాఖ సీజన్‌కు ముందు బృందాలుగా ఏర్పడి నకిలీ విత్తనాల సరఫరాను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఐనా వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరింపజేసుకుంటూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం వానాకాలం సీజన్‌కు ముందే నకిలీ వ్యాపారులుతమ వ్యాపారాలను విస్తరింపజేసుకుంటున్నారు. మే మాసంలోనే నకిలీ వ్యాపారం ప్రారంభమవుతోంది. జూన్‌ మాసంలో వర్షాలు ప్రారంభం కాగానే విత్తనాలు విత్తడం ప్రారంభమవుతుంది. అప్పటికే రైతులకు విత్తనాలు చేర్చుతున్నారు. ధర తక్కువగా ఉండటం ప్యాకెట్లు ఆకర్షనీయంగా ఉండటం వాటిపై దిగుబడికి సంబంధించి పెద్దపెద్ద ఫోటోలు ఏర్పాటు చేయడం రైతులను ఆకర్షిస్తోంది. మాయమాటలు చెప్పే వారిని రైతులు గుడ్డిగా నమ్ముతారు అందులో భాగంగానే వెంటనే వారి మాయమాటలు నమ్మి నకిలీ విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.

మూడు రాష్ట్రాలనుండి నకిలీ విత్తనాలు….

సొంత రాష్ట్రంతోపాటు పక్క రాష్ట్రమైన కర్నూల్‌ నుండి నకిలీ విత్తనాలు ఎక్కువగా వచ్చేవి. వీటికితోడు గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలనుండి కూడా నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారు. మూడు రాష్ట్రాలనుండి నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారు. పేరున్న కంపనీల పేరుతో నకిలీ విత్తనాలు ప్యాకింగ్‌ చేసి సరఫరా చేస్తున్నారు. మూడు రాష్ట్రాలనుండి లూజ్‌ సీడ్స్‌తోపాటు ప్యాకెట్లు కూడా సరఫరా చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రముఖ కంపనీల ప్యాకింగ్‌కు ఏమాత్రం తీసిపోకుండా నకిలీ ప్యాకింగ్‌ తయారు చేస్తున్నారు. ప్యాకెట్లు నకిలీవా లేక అసలువా అని గుర్తించలేని విధంగా ప్యాకింగ్‌ తయారు చేస్తున్నారు. ప్యాకెట్లు చూస్తే నకిలీవి ఏవీ…అసలు ఏవీ అనే అనుమానాలు కలుగుతాయి. ప్యాకింగ్‌లను చూసి రైతులు మోసపోతున్నారు. తక్కువ ధరకు రావడం ప్రముఖ కంపనీలకు చెందిన సీడ్‌ ఉండటంతో ఎలాంటి అనుమానం కలగడం లేదు. చాలామంది రైతులు ప్రముఖ కంపనీలకు చెందిన సీడ్స్‌నే వినియోగిస్తున్నారు. ఇది నకిలీ వ్యాపారులకు కలిసి వస్తోంది. ఆ ప్రముఖ కంపనీలకు చెందిన ప్యాకింగ్‌లు తయారు చేసి రైతులను మోసం చేస్తున్నారు…

రైళ్లు…ట్రాన్స్‌ఫోర్టులో సరుకు రవాణా…..

- Advertisement -

వివిధ రాష్ట్రాలనుండి వచ్చే నకిలీ విత్తనాలు ఎక్కువగా రైళ్లు….ట్రాన్స్‌ఫోర్టు ద్వారా రవాణా చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా సరుకు రవాణా చేస్తున్నారు. రైళ్లలో నకిలీ విత్తనాలు విడతల వారీగా సరఫరా చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ట్రాన్స్‌ఫోర్టు వ్యవస్థను కూడా బాగా వినియోగించుకుంటున్నారు. పెద్దపెద్ద లారీల్లో కింద భాగంలో నకిలీ విత్తనాలు ఏర్పాటు చేసి పైన భాగంలో వేరే సరుకులు లోడ్‌ చేస్తున్నారు. లారీ మొత్తం కాళీ చేస్తే తప్ప కింద భాగంలో ఎలాంటి సరుకు ఉందో తెలుస్తుంది. అనుమానం వస్తే తప్పా లారీలో ఉన్న సరుకులుమొత్తం కాళీ చేసే పరిస్థితి లేదు. ఇది వ్యాపారులకు కలిసి వస్తోంది. తమకు అనుకూలంగా ఉన్న వ్యవస్థను వ్యాపారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. దొరికితే దొంగలు లేకుంటే లేదనే విధంగా పరిస్థితి తయారైంది. సరుకు దొరికితే వారి కింద పని చేసే వారే తాము వ్యాపారం చేస్తున్నామని చెప్పిస్తారు…వారిని బయటకు తీసుకొచ్చేంతవరకు అంతా వ్యాపారులే చూసుకుంటున్నారు. పట్టుబడే వారికి అన్ని రకాల చూసుకోవడంతో నేరం వారిమీద వేసుకునేందుకు కూడా వాళ్లు వెనకాడటం లేదు.

నెలరోజులు అప్రమత్తత అవసరమే….

మరికొన్ని రోజుల్లో సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో అప్రమత్తత అవసరమే. ఇప్పటికే పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు పెద్దగా నకిలీ విత్తనాలు దొరికిన దాఖలాలు లేవు. ఇప్పటికే శివారు ప్రాంతాలకు నకిలీ విత్తనాలు చేరిపోయాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ప్యాకింగ్‌ కేంద్రాలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు శివార్లలో గోడౌన్లు చాలా ఉన్నాయి. ఇందులో కూడా స్టాకులు పెట్టుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అవకాశం ఉన్న ప్రతి దానిని తనిఖీలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నకిలీ వ్యాపారాలకు శివార్లు కేంద్రంగా మారాయి. ఈ ప్రాంతాలపై నిఘా పెడితే చాలావరకు నకిలీ స్టాక్‌ దొరికే అవకాశం ఉంటుంది….

నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉన్నాం….జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి…

నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉన్నాం…క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తున్నాం..రైతులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అనుమానం వస్తే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వండి….తక్కువ ధరకు అమ్ముతామని వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉండండి…ఎందుకు తక్కువ ధరకు అమ్ముతున్నారనే విషయమై ఆలోచించండి..ఎలాంటి అనుమానం వచ్చినా పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వండి…జిల్లా, డివిజన్‌, మండల స్థాయిలో క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తున్నాం..నకిలీ విత్తనాల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉంది…మార్కెట్‌లోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది…..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement