అమరావతి, ఆంధ్రప్రభ : ఎక్స్ప్రెస్ హైవేల ని ర్మాణం, రాష్ట్ర రహదారులకు జాతీయ గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోంది. పారిశ్రామిక అభివృద్ధిలో కీలకమైన రహదారుల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే 11 రాష్ట్ర రహదారులకు జాతీయ గుర్తింపు సాధించిన ప్రభుత్వం తాజాగా మరో ఆరు కొత్త ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణంలో ప్రగతిని సాధించింది. రాష్ట్రం మీదుగా మరో ఆరు ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు ఇప్పటికే కేంద్రం ఆమోదముద్ర వేసింది. తాజాగా ఈ ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణానికి సంబంధించి ఎన్హెచ్ఏఐ రూపొందించిన డీపీఆర్లకు ఆమోదముద్ర వేసి రూట్ క్లియర్ చేసింది. దీంతో రాష్ట్రం మీదుగా ఇతర రాష్ట్రాలను కలుపుతూ మరో ఆరు ఎక్స్ప్రెస్ వేలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 378 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం సాగనుంది.
గతంలో ఉన్న హైవేలకు కనెక్టివ్ హైవేలుగా వీటిని నిర్మించనున్నారు. తాజాగా ఆమోదముద్ర పొందిన ఆరు హైవేల్లో బెంగళూర్ – చెన్నై హైవేకు సంబంధించి అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కొత్త ఎక్స్ప్రెస్ వే నిర్మాణం కానుంది. మొత్తం 92 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇక చిత్తూరు, చెన్నై ఎక్స్ప్రెస్ వేకు సంబంధించి మరో 75 కిలోమీటర్ల మేర, రాయపూర్ – విశాఖపట్నం హైవేలో 100 కిలోమీటర్లు, విజయవాడ – నాగపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో 32 కిలోమీటర్లు, కర్నూలు – షోలాపూర్ ఎక్స్ప్రెస్ హైవేలతో పాటు హైదరాబాద్ – విశాఖపట్నం ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం రాష్ట్రం మీదుగా సాగనుంది. ఈ కొత్త రోడ్ల నిర్మాణాన్ని 2025 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఎన్హెచ్ఏఐ ప్రణాళికలను సిద్ధం చేస్తోం ది. దేశవ్యాప్తంగా 2 వేల కిలోమీటర్లకు పైగా నిర్మించనున్న ఈ ఆరు హైవేలు రాష్ట్ర హైవేలకు అనుసంధానంగా మారనున్నాయి.
ఈ కొత్త హైవేల నిర్మాణంతో కనెక్టివిటీ పెరగడంతో పాటు ప్రయాణ సమయం ఆదా అవుతోంది. అంతేకాకుండా సరుకు రవాణా వ్యవస్థ మరింత పటిష్టం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఐదు కొత్త హైవేలకు భూ సేకరణ ప్రక్రియ కూడా పూర్తికాగా విశాఖ, హైదరాబాద్ హైవేకు సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలతో జాప్యం చోటు చేసుకుంది. ప్రధానంగా ఈ హైవే నిర్మాణమంతా మారుమూల ఏజెన్సీ ప్రాంతాల మీదుగా సాగనున్న నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇదే సమయంలో వివిధ రాష్ట్రాల మీదుగా మన రాష్ట్రానికి వచ్చే ఈ ఆరు హైవేలకు ఇప్పటికే టెండర్లు కూడా పిలిచేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 2వ వారంలోగా టెండర్ ప్రక్రియను పూర్తి చేసి, హైవేల నిర్మాణాన్ని ప్రారంభించాలన్న యోచనలో ఉన్న ఎన్హెచ్ఏఐ దీనికి సంబంధించిన కార్యాచరణను రూపొందించింది.