వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమి నేపథ్యంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తోపాటు కెప్టెన్ రోహిత్‌శర్మ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరి పదవులకు ముప్పు తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రోహిత్‌శర్మ కెప్టెన్సీపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చర్య వెంటనే ఉండకపోవచ్చని, వెస్టిండీస్ పర్యటన ఫలితాన్ని బట్టి బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంటుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
త్వరలో విండీస్‌తో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌లకు రోహిత్‌నే సారథిగా కొనసాగించాలని నిర్ణయించిన బీసీసీఐ, ఈ సిరీస్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పించాలా? కొనసాగించాలా? అనే విషయాన్ని తేల్చనుంది. ఏదేమైనా రెండేళ్ల డబ్ల్యుటీసీ సైకిల్‌కు రోహిత్‌ను కెప్టెన్సీగా కొనసాగించడం సందేహమనే వాదనలు వినిపిస్తున్నాయి. 2025లో జరిగే మూడవ డబ్ల్యుటీసీ ఫైనల్ నాటికి 38 ఏళ్ల వయసులో జట్టుకు ఆడటం కూడా అనుమానమేనని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.
టాప్-3 మార్పు తప్పదా?
2022లో టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన నాటినుంచి టీమిండియా 10 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 3మ్యాచ్‌లకు రోహిత్ దూరమయ్యాడు. మిగతా 7 టెస్టుల్లో 35.45 సగటుతో 390 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ మాత్రమే ఉంది. ఇక విరాట్ కోహ్లీ విషయానికొస్తే 10 టెస్టుల్లో 17 ఇన్నింగ్స్‌లు ఆడి 517 పరుగులే చేశాడు. ఇందులో అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాపై చేసిన 186 పరుగులే అత్యుత్తమ ఇన్నింగ్స్. చెతేశ్వర్ పుజారా కెరీర్‌పైనా నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
గత ఏడాది కాలంలో 8 టెస్టులు ఆడిన జూనియర్ వాల్, 14 ఇన్నింగ్ ్సలలో 482 పరుగులు సాధించాడు. బంగ్లాదేశ్‌పై చేసిన 90, 102 పరుగులే బెస్ స్కోర్ కావడం విశేషం. రాబోయే మూడేళ్లను పరిగణనలోకి తీసుకుంటే ఈ ముగ్గురూ 35 ఏళ్లు పైబడిన జాబితాలో చేరతారు. అందుచేత టాపార్డర్‌లో వీరికి చోటివ్వడం కష్టతరమే అవుతుంది. ఈ ముగ్గురి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయాల్సిన అనివార్యత ఏర్పడుతుంది అని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.