ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా రేపటి నుంచి మాంచెస్టర్ వేదికగా చివరి టెస్టు ఆడనుంది. చివరి టెస్టులో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు కోహ్లీ సేన ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఓవల్ టెస్టులో టీమిండియాకు విజయంతో పాటు షాక్ కూడా తగిలింది. రోహిత్ శర్మ, పుజారా లాంటి కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. దీంతో ఆఖరి టెస్టులో టీమిండియా కొన్ని మార్పులు చేర్పులతో బరిలోకి దిగనుంది.
మరోవైపు గాయంతో నాలుగో టెస్ట్‌కు దూరమైన టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. అతడితో పాటు నాలుగో టెస్ట్‌లో చీలమండ గాయానికి గురైన పుజారా కూడా పూర్తిగా కోలుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బుధవారం టీమిండియా సాధనలోనూ మహమ్మద్ షమీ పాల్గొన్నాడు. దీంతో శుక్రవారం ప్రారంభమయ్యే అయిదో టెస్టుకు షమీ, పుజారా అందుబాటులో ఉండనున్నాడు. మరోవైపు ఓపెనర్ రోహిత్‌శర్మ ఫిట్‌నెస్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. మోకాలి గాయంతో రోహిత్ ఇబ్బంది పడుతుండటంతో అతడు ఆఖరి టెస్టులో ఆడటం సందిగ్ధంగా మారింది. ఒకవేళ అతడు దూరమైతే పృథ్వీషా లేదా మయాంక్ అగర్వాల్‌లో ఒకరు ఆడే అవకాశాలున్నాయి.