భారత క్రికెట్ టీమ్ ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 క్రికెట్‌లో ఏ ఇతర ఇండియన్ బ్యాటర్‌కూ సాధ్యం కాని రికార్డును అందుకున్నాడు. ఐపీఎల్‌లో భాగంగా (IPL 2021) మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు టీ20 క్రికెట్‌లో 400వ సిక్సర్ కొట్టాడు. ఇప్పటి వరకూ ఇండియా తరఫున రోహిత్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. అతని తర్వాత ఏ బ్యాటర్ కూడా 350 సిక్సర్లు దాటలేదు. 325 సిక్సర్లతో సీఎస్కే బ్యాటర్ సురేశ్ రైనా రెండోస్థానంలో ఉండగా.. ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి 320 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ధోనీ 304 సిక్స్‌లు కొట్టాడు.
ఇక రోహిత్ బాదిన మొత్తం 400 సిక్సర్లలో 133 ఇండియన్ టీమ్ తరఫున కాగా.. 227 ఐపీఎల్‌లో బాదాడు. మరో 24 చాంపియన్స్ లీగ్ టీ20లో కొట్టాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌ల రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. 1042 సిక్సర్లతో అతడు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. క్రికెట్ చరిత్రలో 1000 సిక్సర్లు దాటిన ఏకైక ప్లేయర్ అతడే. ఆ తర్వాత పొలార్డ్ (758), రసెల్ (510), బ్రెండన్ మెకలమ్ (485), షేన్ వాట్సన్ (467), ఏబీ డివిలియర్స్ (434) ఉన్నారు.