ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పోరాడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్సులో 270/3 స్కోరు సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. అతడికి విదేశాల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. 256 బంతుల్లో 127 పరుగులు చేసి రాబిన్‌సన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. లోకేష్ రాహుల్ 46 పరుగులు చేశాడు. మరోవైపు జట్టులో తన చోటును ప్రశ్నార్థకం చేసుకున్న పుజారా హాఫ్ సెంచరీతో జట్టును నిలబెట్టాడు. అతడు 127 బంతుల్లో 61 పరుగులు చేశాడు.
రోహిత్, పుజారా పోరాటంతో ఇంగ్లండ్‌పై భారత్ 171 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక భారత్‌కు తిరుగులేదు అని భావిస్తున్న తరుణంలో కొత్త బంతితో ఇంగ్లండ్ బౌలర్లు విజృంభించారు. రాబిన్‌సన్ ఒకే ఓవర్‌లో రోహిత్, పుజారాలను ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (22), జడేజా (9) ఉన్నారు. నాలుగోరోజు ఎప్పటివరకు బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్‌కు ఎంత టార్గెట్ నిర్ధారిస్తారన్న దానిపైనే ఈ టెస్టులో భారత్ విజయావకాశాలు ఉన్నాయి.