ఎడ్గ్‌బాస్టన్‌లో జులై 1న ఇంగ్లండ్‌తో జరిగే ఐదవ టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టు పగ్గాలు పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అప్పగించనున్నారు. కెప్టెన్ రోహిత్‌శర్మ కోవిడ్ బారిన పడి ఇంకా కోలుకోకపోవడంతో ఈ మార్పు తప్పదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. లీచెస్టర్ జట్టుతో జరిగిన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో రోహిత్ ఆడిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసిన రోహిత్ ఆ తర్వాత కోవిడ్ లక్షణాలు కన్పించడంతో పరీక్షలు చేయించుకోగా నిర్ధారణ అయ్యింది. దాంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆడలేదు. ఆ తరువాత చికిత్స చేయించుకున్నప్పటికీ ఇంకా పూర్తిగా కోలుకోలేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో పేస్ బౌలర్ బుమ్రాకు సారథ్య బాధ్యతలు అప్పగించే సూచనలు కన్పిస్తున్నాయి. అదే జరిగితే, హర్యానా హరికేన్ కపిల్‌దేవ్ తరువాత పేస్ బౌలర్ జట్టు పగ్గాలు చేపట్టడం ఇదే ప్రథమం అవుతుంది. కాగా బుధవారంనాడు భారతజట్టు ఆటగాళ్లు గ్రౌండ్స్‌లో పెద్దఎత్తున ప్రాక్టీస్ చేశారు. ఆ సెషన్‌కు రోహిత్ శర్మ హాజరు కాలేదు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యం సాధించిన భారత్ రీషెడ్యూల్ చేసిన ఐదవ టెస్ట్‌లోనూ విజయం సాధించడమో, డ్రాగాచేయడమో చేస్తే సిరీస్ దక్కుతుంది.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ దూరం కావడం అశనిపాతమే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన టెస్ట్ మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ విజృంభణతో 5వ టెస్టును నిలిపివేసి ఇప్పుడు నిర్వహిస్తున్నారు. ఈ జట్టుకు మొదట రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించాల్సి ఉండగా కోవిడ్ సోకడంతో మార్పు అనివార్యమవుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.