ఉక్రెయిన్‌కు అత్యంత ఆధునిక రాకెట్ సిస్టమ్స్‌ను అందించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అంగీకరించారు. దాదాపు 700 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధ ప్యాకేజీకి ఆయన సూత్రప్రాయంగా అనుమతించారు. ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేయడం లాంఛనమే. ఇదే విషయాన్ని ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. తూర్పు ఉక్రెయిన్‌లో చొచ్చుకుపోతున్న రష్యా బలగాలను నిలువరించడానికి ఇలాంటి అత్యాధునిక ఆయుధాలు కావాలని అధ్యక్షుడు జెలెన్‌స్కీ పదేపదే కోరుతున్న నేపథ్యంలో బిడెన్ సానుకూలంగా స్పందించారు. బిడెన్ నిర్ణయంతో రష్యా ఉలిక్కిపడింది. అమెరికా నిర్ణయం సరికాదంటూ కారాలుమిరియాలు నూరుతోంది. అమెరికా ఇప్పుడు సరఫరా చేసే హై మొబిలిటి ఆర్టిలరీ (హిమార్స్ -హెచ్‌ఐఎంఎఆర్‌ఎస్) రాకెట్ సిస్టమ్స్ వల్ల 80 కి.మి దూరంలోని లక్ష్యాలను అత్యంత కచ్చితతంతో ఛేదించవచ్చు. ఈ వ్యవస్థల ద్వారా దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించేందుకు వీలుంటుంది.అయితే తాము సరఫరా చేసే రాకెట్ సిస్టమ్స్ ద్వారా రష్యా భూభాగంలోని లక్ష్యాలపై ఉపయోగించరాదని అమెరికా షరతు విధించింది. కేవలం ఉక్రెయిన్ భూభాగంలోకి జొరబడిన రష్యా బలగాలపైనే ప్రయోగించాలని సూచించింది. ఉక్రెయిన్ యుద్ధానికి దౌత్యమార్గంలోనే పరిష్కారం లభిస్తుందని, అయితే చర్చల్లో ఉక్రెయిన్ బలంగా వాదించాలంటే అందుకు తగ్గ ఆయుధ భరోసా ఇవాలని భావిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. యుద్ధంలో పైచేయి సాధిస్తేనే చర్చల్లో గట్టిగా తమ వాదన విన్పించేందుకు అవకాశం ఉంటుందని చెబుతోంది.
అందువల్ల ఉక్రెయిన్‌కు 700 మిలియన్ డాలర్ల ఆయుధ ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు బిడెన్ దస్త్రంపై నోట్ రాశారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఆయుధాలు, మందుగుండు, కౌంటర్ ఫైర్ రాడార్లు, ఎయిర్ సర్వేలెన్స్ రాడార్లు, జావెలిన్ యాంటీ టాంక్ మిసైల్స్, యాంటీ ఆర్మర్ వెపన్స్ సరఫరా చేయనున్నట్లు అమెరికాకు చెందిన ఉన్నతాధికారులు ప్రకటించారు. మరోవైపు ఎం777 హోవిడ్జర్ల వంటి దీర్ఘశ్రేణి ఆయుధ వ్యవస్థలను ఉక్రెయిన్‌కు అందించేందుకు పశ్చిమ దేశాలు సిద్ధంగా ఉన్నాయి. డెన్మార్క్ నుంచి ఇప్పటికే హర్పూన్ యాంటీ షిప్ మిసైళ్లు ఉక్రెయిన్‌కు చేరుకున్నాయి. జర్మనీకూడా ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేస్తామని బుధవారం ప్రకటించింది. విమాన విధ్వంసక క్షిపణులను, అత్యాధునిక రాడార్ వ్యవస్థలను ఉక్రెయిన్‌కు పంపుతున్నట్లు జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ప్రకటించారు. బుండెస్టాగ్ చట్టసభ సభ్యులనుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రకటన చేశారు. తాము సరఫరా చేసే ఆయుధాల్లో నాటో సభ్యదేశాలతో కలసి తాము అభివృద్ధి చేసిన ఐఆర్‌ఐఎస్-టి క్షిపణులున్నాయని ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగిన తరువాత ఇప్పటివరకు తమ మిత్రదేశానికి 15 మిలియన్ రౌండ్ల మందుగుండు, లక్ష హాండ్ గ్రెనేడ్లు, 5వేల యాంటీ ట్యాంక్ మిసైళ్లను సరఫరా చేసినట్లు ఆయు వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..