యూకే పార్లమెంట్‌లో తొలిసారి రోబో సందడి చేసింది. పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ లో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. దేశ సృజనాత్మక పరిశ్రమల భవిష్యత్ గురించిన చర్చలో ఏఐ-దా రోబో పాల్గొంది. లార్డ్స్ కమ్యూనికేషన్స్, డిజిటల్ కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానం చెప్పింది. బీస్టన్‌కు చెందిన బారోనెస్ స్లోవె ల్ అధ్యక్షతన సెషన్‌ను ప్రవేశపెట్టగా, ఏఐ-దా రోబో ప్యానెల్‌ను తన కెమేరాలతో స్కాన్ చేసింది. తనసామర్థ్యాలను వివరించింది. కంటిలోని కెమేరాల ద్వారా అన్నింటినీ దృశ్యమానం చేస్తాను. నాకు ప్రాణం లేనప్పటికీ కళను సృష్టించగలను. నా కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లు, అల్గారిథమ్‌లపై ఆధారపడివున్నాను.
నాకు ప్రాణంలేదు. ఆత్మాశయ అనుభవాలు లేవు. అయినా మానవుడి కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వర్తించగలను అని ఐ-దా వివరించగా కమిటీ సభ్యులు ఆసక్తిగా చూస్తుండిపోయారు. రోబో నిర్దిష్ట సమాచారం ఇస్తున్నప్పటికీ, అది మానవుడి స్థితితో సమానం కాదని బారోనెస్ స్లోవెల్ అభిప్రాయపడ్డారు. తాను రోబోను కించపరచడం లేదని వివరణ ఇచ్చారు. అనంతరం, ఏఐ-దా ఏమేం చేస్తుందని దాని సృష్టికర్త ఐడాన్ మెల్లర్‌ను కమిటీ చైర్మన్ ప్రశ్నించగా, మానవుడిని అనుకరించడానికి రూపొందించబడిన సంక్లిష్టమైన రోబోట్ అని బదులిచ్చారు. 30 కంటే ఎక్కువ మంది దీని నిర్మాణానికి పనిచేశారు. సాంకేతికతను మానవుడిగా చూడటం అనేది నైతిక సమస్య మాత్రమే. దీనిపైనేను చాలా స్పృహతో ఉన్నాను అని ఐడాన్ మిల్లర్ వివరించారు.