ఐటీ అధికారుల పేరుతో దోపిడికీ పాల్పడిన ముఠాను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలోని ఆరంజ్ కౌంటీలో నివాసముండే సుబ్రహ్మణ్యం అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లోకి కేటుగాళ్ళు చొరబడి బంగారు, నగదు దోచుకున్నారు. ఈ ముఠా నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి దోపిడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నిందితులంతా సుబ్రహ్మణ్యం వద్ద పని చేసి సంవత్సరం క్రితమే మానేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సుబ్రహ్మణ్యం వద్ద పనిచేసి మానేసిన జశ్వంత్ అనే వ్యక్తి కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు. జశ్వంత్ తన స్నేహితుడు సందీప్‌తో కలిసి ఈ దోపిడికి పథకం రచించాడని, మొత్తం తొమ్మిది మంది సభ్యులు ముఠాగా ఏర్పడి ఈ దోపిడికి పాల్పడ్డారని సైబారాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు, సుబ్రహ్మణ్యం వద్ద బ్లాక్‌మనీ ఉందని, రెండు నెలల క్రితమే దోపిడికి ప్లాన్ చేసిన ఈ ముఠా తమపై ఆయన ఎలాంటి కేసు పెట్టడని భావించిందన్నారు.
ఓ ట్రావెల్ కారును కిరాయికి మాట్లాడుకుని దాని నంబర్ ప్లేట్ మార్చి దోపిడికి వచ్చారని ఆయన తెలిపారు. తొమ్మిది మంది సభ్యుల ముఠాలో ఐదుగురు మాత్రమే దొరికారని, మిగిలిన వారు పరారీలో ఉన్నారని సీపీ రవీంద్ర తెలిపారు. ముఠా నుంచి బంగారం, మొబైల్‌ఫోన్లు సహా ఒక కోటి 26 లక్షలు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital