హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారీ వర్షాలు సృష్టించిన వరద బీభత్సానికి రాష్ట్రంలోని పలు చోట్ల గ్రామీణ రోడ్లు దెబ్బతిన్నాయని, వాటి మరమ్మతుకు రూ.170కోట్లు ఖర్చు అవుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ప్రాథమిక అంచనాలను రూపొందించింది. వరదలకు మొత్తం 117 గ్రామాలకు వెళ్లే రోడ్లు దెబ్బతిన్నాయని, ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతినడంతో మరో 80 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని వెల్లడించింది.
మిషన్ భగీరథ సబ్ స్టేషన్లలోకి నీరు చేరడంతో విద్యుత్ నిలిపివేశారని, దీంతో పలు గ్రామాల్లో తాగు నీటి సరఫరాలో అంతరాయం తలెత్తిందని తెలిపింది. నీటి పంపింగ్‌కు అవసరమైన విద్యుత్ లేక 5700 ఆవాస గ్రామాలకు మిషన్ భగీరథ నీటి సరఫారాలో సమస్యలు తలెత్తగా, ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్న్యాయ మార్గాల్లో తాగు నీటిని సరఫరా చేశామని వెల్లడించింది.
5700 ఆవాస గ్రామాల్లో ఒక్క రోజులోనే ఇప్పటికే 2000 ఆవాసాల్లో మిషన్ భగీరథ సబ్ స్టేషన్లను పునరుద్దించి నీటి సరఫరా చేస్తున్నామని పేర్కొంది. మిగిలిన ఆవాసాల్లో తాగునీటి సమస్య లేకుండా ప్రత్యామ్నాయ పద్దుతుల్లో తాగు నీరు సరఫరా అవుతోందని తెలిపింది. వరదలతో 1400 చోట్ల మిషన్ భగీరధ సరఫరా పైపులు దెబ్బతినగా మరమ్మత్తులు చేయాలని కాంట్రాక్ట్ ఏజేన్సీలను ఆదేశించినట్లు వివరించింది.