Saturday, November 23, 2024

TS | భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు.. నెలలోగా మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు చేసేందుకు రోడ్లు, భవనాల శాఖ చర్యలు ప్రారంభించింది. గత నెలలో వారం రోజుల పాటు ఏకధాటిగా కురిసిన వర్షాలకు దాదాపు అన్ని జిల్లాలలో రోడ్లతో పాటు కల్వర్టులు సైతం తెగిపోయాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంతో పాటు ఉమ్మడి వరంగల్‌, నల్లగొండ, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాలలో రహదారులకు భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు.

దాదాపు 2వేల కిలోమీటర్లకు పైగా రహదారులు దెబ్బతిన్నట్లు గుర్తించారు. అలాగే, జాతీయ రహదారులకు సైతం భారీ నష్టం వాటిల్లింది. దీంతో ఈ రోడ్లపై ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో అధ్వానంగా మారిన రహదారులపై రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మత్తులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2500 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ నిధులతో ముందుగా కల్వర్టులు, రహదారులను మరమ్మత్తు చేయాలని నిర్ణయించింది. అయితే, పెద్ద మొత్తంలో నిధులు ఖర్చయ్యే పనులకు టెండర్లు ఆహ్వానించాలని రోడ్లు, భవనాల శాఖ అధికారుల నిర్ణయించారు. వీటికి త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నారు. టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా రోడ్ల మరమ్మత్తు పనులను పూర్తి చేయాలని ఆయా జిల్లాల అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు.

- Advertisement -

ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తు పనులను ఆయా జిల్లాల మంత్రులు స్వయంగా సమీక్షిస్తున్నారు. మున్సిపల్‌, పంచాయతీ రాజ్‌, జిల్లా పరిషత్‌ అధికారుల సమన్వయంతో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి కావాలని సూచనలు ఇస్తున్నారు. రాష్ట్రంలో మరో రెండు నెలల్లో శాసనసభ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా వచ్చే నెలలో షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉందనీ, సంబంధిత పనులన్నీ నెలలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తున్నారు. దీంతో రోడ్ల మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement