నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం దువ్వూరు గ్రామం వద్ద జాతీయ రహదారి కూలీలను తీసుకు వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని వెనుక వైపు నుంచి పాల వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో అక్కడిక్కడే నలుగురు మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇంకోరు మృతి చెందారు.
మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. దువ్వూరు నుంచి విడవలూరు కు చేపల వేట కోసం కూలీలు వెళ్తున్నట్టు తెలుస్తోంది.
దువ్వూరు వద్ద కూలీలు టాటా ఏస్ వాహనం ఎక్కుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ప్రమాదంపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృతి చెందడం కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామి ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులకు మంత్రి మేకపాటి ఆదేశించారు.