Saturday, November 23, 2024

Big Story: పల్లెల్లో ఆర్‌ఎంపీలదే రాజ్యం.. గ్రామీణ ప్రాంతాల్లో వారే దిక్కు

(ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి): పెద్ద డాక్టర్ల వద్ద కొన్ని రోజులపాటు పని చేస్తారు.. చిన్నచిన్న జబ్బుల గురించి తెలుసుకుంటారు.. సూదీ ఎలా వేయాలో తెలుసుకుంటారు. అంతే ఇక డాక్టర్లుగా అవతారమెత్తుతున్నారు ఆర్ ఎంపీలు. వచ్చిరాని వైద్యంతో ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నారు. చిన్నచిన్న జబ్బులకు చికిత్సలు చేస్తూ గిట్టుబాటు చేసుకుంటున్నారు. జ్వరం తగ్గకపోవడంతో వారిని ఒప్పందం చేసుకున్న ఆసుపత్రులకు సిఫార్సు చేస్తూ కమీషన్లు దండుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది అమాయకజనం ఉండటంతో వీరి వైద్య వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. వైద్యాధికారుల తనిఖీల్లో తమ గుట్టు బయటపడుతుందనే భయంతో క్లీనిక్‌లకు తాళాలు వేసి తప్పించుకుంటున్నారు. ఫోన్లు స్విచాఫ్‌ చేసి పరారవుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది వీరి వైద్యానికి ఇబ్బందిపడ్డా వైద్యాధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.. పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఎంతోమంది నకిలీ డాక్టర్ల గుట్టురట్టవుతుంది.

డాక్టర్లను దేవుళ్లుగా భావిస్తారు.. చిన్నపాటి ఇబ్బంది వచ్చినా వెంటనే డాక్టర్‌ అంటూ పరుగులు తీస్తారు.. ఇది కొందరికి గిట్టుబాటు కలిగిస్తోంది. డాక్టర్ల వద్ద కొన్ని మాసాలపాటు పని చేసి సూది ఎలా వేయాలో తెలుసుకుని గ్రామాలకుక వెళ్లి వైద్యులుగా చెలామణి అవుతున్నారు. గ్రామాల్లో చిన్నచిన్న ఇబ్బందులతో వచ్చి వారికి వచ్చిరాని వైద్యం చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. మండల కేంద్రాలకు వెళ్లాలంటే 20 నుండి 30 కిలోమీటర్ల దూరం ఉండటంతో చాలామంది గ్రామానికి వచ్చే ఆర్‌ఎంపీలనే ఆశ్రయిస్తున్నారు. గ్రామాన్ని బట్టి ఆర్‌ఎంపీలు అక్కడ తిష్ట వేస్తున్నారు. పెద్ద గ్రామమైతో ఇద్దరు ముగ్గురూ క్లీనిక్‌లు తెరుస్తున్నారు.

చిన్నచిన్న ఇబ్బందులతో వచ్చే వారికి తెలిసిన వైద్యం చేస్తూ రెండు చేతుల సంపాధిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో పదివేల మంది వరకు ఆర్‌ఎంపీలు వైద్యులుగా కొనసాగుతున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 3వేలకు పైగానే ఆర్‌ఎంపీలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. పేరున్న డాక్టర్ల వద్ద కొన్ని మాసాలపాటు పని చేసి గ్రామాలకు వెళ్లి డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. తానో పెద్ద డాక్టర్‌గా చెప్పుకుంటూ రోగులను మోసం చేస్తున్నారు. దర్జాగా ఉండటంతో చాలామంది పెద్ద డాక్టర్లని భావిస్తున్నారు. గ్రామాల్లో కొందరిని మచ్చిక చేసుకుని తిష్ట వేస్తున్నారు. ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్లు వీరికి సహకారం అందిస్తున్నారు…

- Advertisement -

పెద్దాసుపత్రులతో ఒప్పందాలు..
గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న ఆర్‌ఎంపీలు మండల కేంద్రాలు…జిల్లా కేంద్రాల్లో ఉండే ళపెద్దాసుపత్రులతో ఒప్పందాలు చేసుకుని రోగులను అక్కడి పంపించి కమీషన్లు దండుకుంటున్నారు. రోగం ముదిరిపోయిందని పెద్దాసుపత్రికి వెళ్తేనే నయమవుతుందని రోగులకు భయం పుట్టిస్తారు. వాళ్లు చెప్పిన ఆసుపత్రులకు వెళ్తే వెంటనే నయమవుతుందని భరోసా కూడా ఇస్తున్నారు. తమ ఊరి డాక్టర్‌ చెప్పడంతో చాలామంది నమ్ముతున్నారు. అక్కడి వెళ్లిన తరువాత గాని అసలు విషయం తెలియదు. టెస్టుల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు… వీలైతే ఆసుపత్రిలో జాయిన్ చేసుకుని ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. కరోనా వచ్చిన తరువాత చాలామంది చిన్నపాటి ఇబ్బంది వచ్చినా వెంటనే డాక్టర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. రోగం ముదిరిన తరువాత ఇబ్బందులు వస్తాయనే భయం పెరిగిపోయింది. ఇది డాక్టర్లకు కలిసి వస్తోంది. తాను చెప్పిన ఆసుపత్రికి వెళ్తే కర్చు తక్కువ అవుతుందని హామీలు కూడా ఇస్తున్నారు. అక్కడికి వెళ్తే గాని తెలియడం లేదు అసలు కథ.

అబార్షన్లు కూడా చేస్తున్న వైనం….
గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న ఆర్‌ఎంపీలు అబార్షన్లు చేస్తూ రెండు చేతుల సంపాధిస్తున్నారు. రహస్యంగా అబార్షన్లు చేస్తున్న విషయం అందరికీ తెలుసు. కానీ వైద్యాధికారులకు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న దాఖలాలు ఉన్నాయి.మూడేళ్ల క్రితం పరిగిలో వైద్యం వికటించి మహిళ మృతి చెందింది. పరిగి ప్రాంతాల్లో కనీస పది పాస్‌ కాని వాళ్లు కూడా ఆర్‌ఎంపీలుగా అవతారమెత్తి రెండు చేతుల సంపాధించుకుంటున్నారు. కర్ణాటక నుండి వచ్చి ఆర్‌ఎంపీలుగా అవతారమెత్తుతున్నారు. ఎంబీబీఎస్‌ డాక్టర్ల వద్ద అంతా రోగుల సందడి ఉండదు. కానీ ఆర్‌ఎంపీల వద్ద సందడి కనిపిస్తోంది. గతంలో ఆర్‌ఎంపీగా పని చేసే ఒక వ్యక్తి ఓపెన్‌ స్కూల్‌లో పదవ తరగతి పరీక్ష రాయడం గమనార్హం.

క్లీనిక్‌లకు తాళాలు..ఫోన్లు స్విచాఫ్‌…..
నిబంధనలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న క్లీనిక్‌లు, ల్యాబ్‌లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో వైద్యాధికారులు తనిఖీలు చేస్తున్నారు. గత ఆరురోజులుగా తనిఖీలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా పరిధిలోని చేవెళ్ల్‌, షాద్‌నగర్‌ రెవెన్యూ డివిజన్ల పరిధిలో దాదాపుగా 80 శాతం మేర తనిఖీలు చేశారు. ఇంకా రాజేంద్రనగర్‌, కందుకూరు, ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఇంకా తనిఖీలు మొదలుపెట్టలేదు. ఇప్పటికే 430 ఆసుపత్రులు, ల్యాబ్‌లను తనిఖీలు చేశారు. వీటిలో కేవలం పదిశాతం వాటిని మాత్రమే సీజ్‌ చేశారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు.

వారం పది రోజుల గడువు కూడా ఇస్తున్నారు. అప్పటికీ సౌకర్యాలు కల్పించకపోతే మాత్రం సీజ్‌ చేయనున్నారు. తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్‌ఎంపీలు తమ క్లీనిక్‌లకు తాళాలు వేసి…ఫోన్లు ఆఫ్‌ చేసేస్తున్నారు. తనిఖీల సమయంలో అక్కడ ఉంటే తమ గుట్టురట్టవుతుందనే భయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. క్లీనిక్‌లు మూసివేస్తే ఎలాంటి తనిఖీలు చేసే అవకాశం లేదు. కొన్ని రోజులపాటు అలాగే మూసివేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. క్లీనిక్‌ల వద్ద వారి ఫోన్‌నంబర్లు ఉండటంతో ఫోన్లు చేసే అవకాశం ఉంటుందని భావించి వాటిని స్విచాఫ్‌ చేసేస్తున్నారు. కొన్ని రోజులపాటు తప్పించుకు తిరిగితే సరిపోతుందని భావిస్తున్నారు.

కొందరు నకిలీ డాక్టర్లు పేర్లు మర్చుకుని క్లీనిక్‌లు నడుపుతున్నారు. పేరు ఒకరిది ఉండగా అక్కడ పని చేసేవాళ్లు మరొకరు ఉంటున్నారు. ఆర్‌ఎంపీల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటంతో దడ ప్రారంభమైంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావును కలిసి తమను ఇబ్బందులపాలు చేయవద్దని వేడుకున్నారు. కనీస సౌకర్యాలు లేకపోయినా…కనీస విద్యార్హతలు లేకపోయినా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో వైద్య బృందాలు తనిఖీలు ముమ్మరం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement