Monday, November 25, 2024

ఉత్త‌రాఖండ్ స్పీక‌ర్‌గా రితూ ఖండూరీ.. ఆ రాష్ట్రంలో తొలి మ‌హిళా స్పీక‌ర్‌గా రికార్డు!

ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీక‌ర్‌గా రితూ ఖండూరీ ఎన్నిక‌య్యారు. ఆ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఉత్త‌రాఖండ్ అసెంబ్లీకి ఎన్నికైన తొలి మ‌హిళా స్పీక‌ర్‌గా ఆమె నిలిచారు. ఇటీవ‌ల ముగిసిన ఎన్నిక‌ల త‌ర్వాత తొలిసారి స‌మావేశ‌మైన ఉత్త‌రాఖండ్ అసెంబ్లీ ఇవ్వా (శ‌నివారం) నూత‌న స్పీక‌ర్‌గా రితూ ఖండూరీని ఎన్నుకుంది. అసెంబ్లీ స్పీక‌ర్‌గా ఎన్నికైన రితూ ఖండూరీని సీఎం పుష్క‌ర్ సింగ్ ధామీ అభినందించారు. ఆమె సార‌ధ్యంలో రాష్ట్ర అసెంబ్లీ నూత‌న చ‌రిత్ర సృష్టిస్తుంద‌ని వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొట్‌ద్వార్ స్థానం నుంచి కాంగ్రెస్ ప్ర‌త్య‌ర్థి సురేంద్ర సింగ్ నెగిపై విజ‌యం సాధించారు.

అంత‌కుముందు 2017 ఎన్నిక‌ల్లో యంకేశ్వ‌ర్ స్థానం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పుష్క‌ర్ సింగ్ ధామీ ఓట‌మి పాలవ్వ‌డంతో సీఎంగా బీజేపీ అధిష్ఠానం రితూ ఖండూరీకి చోటు క‌ల్పిస్తుంద‌ని వార్త‌లొచ్చాయి. రితూ ఖండూరీ.. ఉత్త‌రాఖండ్ మాజీ సీఎం బీసీ ఖండూరీ త‌న‌య కావ‌డం గ‌మ‌నార్హం. ఉత్త‌రాఖండ్ మాజీ గ‌వ‌ర్న‌ర్ బేబీ రాణి మౌర్య నిన్న‌ యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కేబినెట్‌లో మంత్రిగా ప్ర‌మాణం చేశారు. ఇటీవ‌లి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆగ్రా రూర‌ల్ స్థానానికి ఎన్నిక‌య్యారు. అంత‌కుముందు ఆమె ఆగ్రా తొలి మ‌హిళా మేయ‌ర్‌గా ప‌ని చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement