(న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి) : భారత్‌లోని బాలల్లో నేరస్వభావం పెరుగుతోంది. హింసాత్మక ధోరణులు ఆందోళనలకు గురిచేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు వంట డిజిటల్ ఉపకరణాలు, సామాజిక మాధ్యమాలు భావిభారత పౌరుల ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కరోనా సంక్షోభం అనంతరం పిల్లల జీవనశైలి మారింది. దీర్ఘకాలం పాఠశాలలకు సెలవులివ్వడం, ఆన్‌లైన్ తరగతుల విధానం అమల్లోకి రావడంతో డిజిటల్ ఉపకరణాలు పెద్దెత్తున పిల్లల చేతికి అందుబా టులోకొచ్చాయి. దీంతో 18ఏళ్ళ లోపు పిల్లలు కూడా అశ్లిల వీడియోలు చూసేందుకు అలవాటుపడుతున్నారు. మానభంగాలు, హత్యలు ఎలా చేయాలో.. చేసి ఎలా తప్పించుకోవచ్చో ఆన్‌లైన్‌లోనే తెలుసుకుంటున్నారు. గతంలో పెద్దల్లోనే నేరప్రవృత్తి అధికంగా ఉండేది. గత మూడు, నాలుగేళ్ళుగా యువత, బాలల్లో కూడా నేరాలోచనలు పెరుగుతున్నాయి. అత్యాచారాలు, హత్యలు, దోపిడీలకు సైతం వీరు వెనుకాడటం లేదు. చెడు సహవాసాలు, వ్యసనాలు, విలాసవంతమైన జీవితంపై మోజు వంటి కారణాలతో డబ్బు సులువుగా సంపాదించేందుకు చిన్నతనం నుంచి అడ్డదారులు తొక్కుతున్నారు. చిన్న చిన్న వాగ్వివాదాల సమయంలోనూ క్షణికావేశాలకు లోనై హత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల పెరిగిన బెట్టింగ్‌ల సంస్కృతి కూడా లక్షలాదిమంది యువతను నేరాలబాట పట్టిస్తోంది.
చెన్నైలోని సెయింట్ మేరీస్ హైస్కూల్లో తరగతులకు క్రమంగా హాజరుకావడం లేదంటూ 14ఏళ్ళ విద్యార్ధిని టీచర్ ఉమామహేశ్వరి మందలించింది. టీచర్‌పై ద్వేషం పెంచుకున్న ఆ విద్యార్థి మర్నాడు కత్తితెచ్చి ఉమామహేశ్వరి గొంతుకోసి హత్యచేశాడు. పదేళ్ళ క్రితం ఢిల్లిలో నిర్భయపై జరిగిన హత్యాచార సంఘటనలోనూ దోషిగా నిర్ధారించబడ్డ 17ఏళ్ళ కుర్రాడు నిర్భయపై అనేకసార్లు అత్యాచారం జరపడంతో పాటు ఆమె పొత్తికడుపులోకి ఇనుపకడ్డీని గుచ్చి ప్రేగులు బయటకు లాగి ఆమెను బస్సులోంచి బయటకు విసిరేయడంలో సహచరులకు సాయం చేశాడు. పైగా అత్యాచారం, చిత్రహింసలకు సంబంధించి ఆనవాళ్ళు లేకుండా బస్సును అతనొక్కడే శుభ్రంగా కడిగేశాడు. ఈ సంఘటన 17ఏళ్ళ వయస్సున్న అతనిలో అప్పటికే కరడుకట్టుకున్న నేరస్వభావానికి అద్దం పడుతోంది. అశ్లిల వీడియోలు చూడమంటే నిరాకరించిందన్న అక్కసుతో అసోం రాష్ట్రం నగావ్ జిల్లాలో ఆరేళ్ళ చిన్నారిని 8నుంచి 11ఏళ్ళ మధ్య వయసుగల ముగ్గురు బాలలు హింసించి మరీ హతమార్చారు. పిల్లల్లో నేరప్రవృత్తి, హింసాత్మక ధోరణి పెచ్చ రిల్లుతున్నాయనడానికి ఈ ఘటనలన్నీ నిదర్శనం. పిల్లల్లో నేరప్రవృత్తి పెంచడంలో సామాజిక మాధ్యమాలు, టెలివిజన్‌లో ప్రసారమౌతున్న పలు షోలు కూడా కారణమౌతున్నాయి. దీర్ఘకాలం దూరదర్శన్‌లో ప్రసారమైన శక్తిమాన్ అనే టీవీ షో చూసి పలువురు పిల్లలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఎత్తయిన ప్రదేశాల నుంచి దూకితే శక్తిమాన్ వచ్చి తమను కాపాడుతాడని పలువురు బిల్డింగ్‌లపై నుంచి దూకి చనిపోయారు. మొబైల్ గేమ్స్‌లో కూడా మితిమీరిన హింస చూపిస్తున్నారు. ఎదుటి వ్యక్తిని చంపడం కోసం రూపొందించిన పబ్‌జీ, మోడన్‌కమ్‌బాక్ వంటి ఆటలు పిల్లల్లో ఆత్మహత్య, హత్యాప్రవృతులను ప్రేరేపిస్తున్నాయి. పబ్‌జీ ఆట కోసం ఓ పిల్లాడు తండ్రికి తెలియకుండా అతని ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసిన వైనం ఇటీవలె వెలుగుచూసింది. మరో కుర్రాడైతే ఏకంగా తల్లి నగ్న వీడియోలు తీసి పోర్న్ సైట్‌లో పెట్టిన ఉదంతం బయటకొచ్చింది.
18ఏళ్ళలోపు నేరస్తుల్లో ఎక్కువమంది ప్రాథమిక, మాధ్యమిక విద్య పూర్తి చేసిన వారే. 2020లో 59,526మంది బాలనేరస్తుల్ని గుర్తించారు. 2020లో నేరనిర్ధారణ జరిగిన వారిలో 17ఏళ్ళలోపు వయస్సున వారి సంఖ్య 59,526. 2005లో ఇది 18,939. అయితే చట్టానికి చిక్కని, చట్టం దృష్టిలోకి రాని 17ఏళ్ళలోపు బాలల నేరస్తుల సంఖ్య ఇంతకు పదిరెట్లు అధికంగా ఉంటుందని అంచనా. ఈ 17ఏళ్ళలోపు నేరస్తుల్లో 31.1శాతం మంది ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. 36.6శాతం మంది మాధ్యమిక విద్యను కూడా పూర్తి చేసిన వారున్నారు. టీనేజ్ పిల్లల్లో నేరస్వభావం పెరుగుతోందన్న విషయం ఈ గణాంకాల ద్వారా తెలుస్తోంది. తొలిసారి నేరం చేసిన వారే కాకుండా మళ్ళీ మళ్ళీ నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది. పిల్లలకు కూడా ఇప్పుడు మాదకద్రవ్యాలు అందుబాటులోకొచ్చేశాయి. గంజాయి వంటివి వీధుల్లో దుకాణాల్లో కూడా లభిస్తున్నాయి. మరోవైపు తల్లిదండ్రులకు సమాజానికి కూడా పిల్లల్ని పట్టించుకునే తీరిక లేదు. ఇక పాఠశాలల్లో వీరి వ్యక్తిగత ప్రవర్తనాతీరును ఏమాత్రం అంచనా వేయడంలేదు. విద్యార్థుల్లో డిజిటల్ పరికరాల వినియోగం రాన్రాను ఓ వ్యవసనంగా మారుతోంది. ఇది నేరప్రవృత్తిని పెంచుతోందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తన అధ్యయనంలో పేర్కొంది. దేశంలోని 9నుంచి 17ఏళ్ళ లోపు వయసులో గల పిల్లల్లో 30.2శాతం మందికి సొంతంగా సెల్‌ఫోన్లు ఉన్నాయి. ఆ వయసు లోపు పిల్లల్లో 15.80శాతం మంది రోజుకు 4గంటలు, 5.30శాతం మంది రోజుకు నాలుగు గంటలకు పైగా సెల్‌ఫోన్‌లతో గడుపుతున్నట్లు కమిషన్ అధ్యయనం వెల్లడించింది.
స్మార్ట్ ఫోన్‌లున్న విద్యార్థుల్లో 45నుంచి 48శాతం మంది అశ్లిల వీడియోలు, వాటి సమాచారం కోసం వెతుకుతున్నట్లు హైదరాబాద్‌లోని షీటీమ్ నిర్వహించిన సర్వేలో తేలింది. నిరక్షరాస్యత, పేదరికంతో పాటు నేరపూరిత వాతావరణంలో పెరుగుతున్న పిల్లలు కూడా హత్యలు, అత్యాచారాలకు తెగబడుతున్నారు. అయితే పేదింటి నుంచి వచ్చిన పిల్లలే ఎక్కువగా ఈ నేరాలకు పాల్పడుతున్నారన్న ప్రచారాన్ని నిపుణులు కొట్టిపారేసారు. 90శాతానికి పైగా బాల నేరస్థులు మధ్యతరగతి, ఉన్నత తరగతుల కుటుంబాల నుంచి వచ్చిన వారేనని స్పష్టం చేస్తున్నారు. అలాగే 2020లో బాలనేరస్థులపై నమోదైన అత్యధిక కేసులు, అత్యాచారాలు, హత్యలు, హత్యాయత్నాలు, కిడ్నాప్‌లు, బెదిరింపులు, దారిదో పిడీలు, ఇళ్ళల్లో చోరీలు, చైన్‌స్నాచింగ్‌లు ఆడపిల్లల్ని కిడ్నాప్ చేయడం వంటివే. అయితే వీరిలో 13శాతం మంది మాత్రమే అనాధలు లేదా వీధి బాలలుగా గుర్తించారు. మిగిలిన 87శాతం మంది తల్లిదండ్రులు లేదా బంధువుల సంరక్షణలో పెరుగుతున్న పిల్లలే.
నేరాలను అరికట్టేందుకు చైనా రూల్స్..
యువత, బాలల్లో నేరప్రవృతి పెట్రేగిపోకుండా చైనా ప్రభుత్వం ఇటీవల కొన్ని నిర్దిష్ట ఆలోచనల్ని అమల్లో పెట్టింది. ఈ మేరకు 18ఏళ్ళలోపు వారెవరూ వారానికి మూడుగంటలకు మించి ఆన్‌లైన్‌లో గేమ్‌లు ఆడ కూడదని ఆంక్షలెట్టింది. అలాగే ప్రత్యేక తరగతులు హోమ్‌వర్క్, ట్యూషన్ వర్క్ అంటూ విద్యార్థులపై ఒత్తిడి పెంచే విధానాన్ని నిలిపేసింది. పాఠశాలల పనివేళల్ని తగ్గించింది. తల్లిదండ్రులు తమ పిల్లలపై వ్యక్తిగత శ్రద్ధ చూపాలని ఆదేశించింది. వారికి నైతిక విలువలు, సత్‌ప్రవర్తన నేర్పాలని సూచించింది. అవసరమైన మేరకే పిల్లలకు యువతకు డిజిటల్ ఉపకరణాల్ని అందుబాటులో ఉంచాలని కూడా పేర్కొంది. పైగా పిల్లల్లో నేరప్రవృత్తి పెరగకుండా తల్లిదండ్రులతో పాటు పరిసరవాసులు, సమాజం కూడా బాధ్యత తీసుకోవాలని సూచించింది. ఇలా.. ఆ దేశంలో భావిపౌరుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సంకల్పించింది. ఇలాంటి విధానాన్ని భారత్‌లో కూడా కఠినంగా అమలు చేయాలి. పిల్లలకు మాదకద్రవ్యాలు అందుబాటులో లేకుండా కట్టడి చేయాలి. అలాగే సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు శృతిమించి వినియోగించకుండా ఆంక్షలెట్టాలి. అప్పు డే ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్న యువ శక్తిని భారత్ కూడా ఈ దేశ భవిష్యత్‌కు అనుగుణంగా దేదీ ప్యమానంగా వెలుగొందుతుందని పేర్కొంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.