Sunday, November 24, 2024

విదేశీ విద్యార్థులపై రిషి సునాక్‌ ఆంక్షలు.. వలసల నియంత్రణ, కొత్త విధానం దిశగా కసరత్తు

విదేశాల నుంచి నానాటికీ పెరుగుతున్న వలసలపై బ్రిటన్‌ ప్రభుత్వం కలవరం చెందుతోంది. ముఖ్యంగా విద్యార్థుల వలసలు వేగంగా పెరుగుతున్నాయి. దీన్ని నియంత్రించేందుకు కొత్త విధానం తీసుకురావాలని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ భావిస్తున్నారు. విద్యార్థి వీసాలను తగ్గించడంతోపాటు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వచ్చాయి. వలస వ్యవస్థను పటిష్టం చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం. వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు ప్రధాని సునాక్‌ కట్టుబడివున్నారు అని డౌనింగ్‌ స్ట్రీట్‌ అధికార ప్రతినిధి మీడియాతో చెప్పారు.

ఇందులో భాగంగా విదేశీ విద్యార్థులపై కొన్ని ఆంక్షలు విధించబోతున్నారని, పెద్దగా ప్రాధాన్యం లేని డిగ్రీలకోసం వచ్చే విద్యార్థులు, డిపెండెంట్‌ వీసాలతో వచ్చే విద్యార్థులపై ఈ ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. అయితే, ప్రాధాన్యం లేని డిగ్రీల జాబితాపై స్పష్టత ఇవ్వడానికి సదరు అధికార ప్రతినిధి సమాధానం దాటవేశారు. జాతీయ గణాంకాల సంస్థ విడుదల చేసిన వివరాల పట్ల యునైటెడ్‌కింగ్‌డమ్‌ (యూకె) ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ సంస్థ విడుదల చేసిన గణాంకాల్లో వలసదారుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. 2021లో 1.73లక్షల మంది వలసదారులు ఉండగా, ఈ ఏడాది ఆ సంఖ్య 5 లక్షలు దాటింది. అంటే 3,31,000మంది పెరిగారన్న మాట. అయితే, అంతర్జాతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులే కావడం విశేషం.

కాగా, యూకేలోని వలసదారుల గణాంకాల నుంచిఅంతర్జాతీయ విద్యార్ధుల జాబితాను తొలగించాలని యూకే ప్రభుత్వానికి భారత వలస విద్యార్ధుల నేతృత్వంలోని విద్యార్ధి సంఘాల సమాఖ్య విజ్ఞప్తి చేసింది,యూకేలో భారతీయ విద్యార్ధులు గడువు తీరిన తర్వాత కొనసాగుతున్నారంటూ హోం మంత్రి సుయిల్లా బ్ర్రవర్‌మన్‌ సునాక్‌ అధికారంలోకి రాగానే ఫిర్యాదు చేశారు.ఈ విషయమై లోతుగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని సునాక్‌ అప్పట్లో హామీ ఇచ్చారు.

- Advertisement -

ఒకవేళ సునాక్‌ ప్రభుత్వం వలసల నియంత్రణకు ఏవైనా చర్యలు తీసుకుంటే, అది కచ్చితంగా భారతీయులపైనే అధికంగా ఉంటుంది. అయితే, ఇదంత సులభం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. విద్యార్థులను నియంత్రించాలనే ఆలోచన ఇటు బ్రిటన్‌ విద్యావ్యవస్థను దెబ్బతీస్తుందని అంటున్నారు. బ్రిటన్‌లో కొన్ని విశ్వవిద్యాలయాలు పూర్తిగా విదేశీ విద్యార్థులపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఆంక్షలు గనుక విధిస్తే ఇలాంటి యూనివర్సిటీలు దాదాపు మూతబడే పరిస్థితి తలెత్తు తుందని హెచ్చరిస్తున్నారు. వలసల విషయంలో వివాదాలు, విమర్శలను ఎదుర్కొంటున్న బ్రిటన్‌ ప్రభుత్వానికి ఇదొక పెద్ద సవాల్‌గా మారింది. సున్నితమైన, ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపడివున్న ఈ అంశాన్ని సునాక్‌ ఎలా డీల్‌ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement