Saturday, November 23, 2024

రిషి సునక్‌కు బ్రేకులు, మసకబారిన ప్రతిష్ట.. ప్రధాని రేసులో వెనుకంజ..

బ్రిటన్‌ తదుపరి ప్రధాని రేసులో ప్రస్తుత ఆర్థికమంత్రి రిషి సునక్‌ పేరు మొన్నటి వరకు ప్రముఖంగా వినిపించింది. అనేక సర్వేలు కూడా ఆయనవైపు మొగ్గుచూపాయి. కానీ, ప్రస్తుతం పరిణామాలు మారాయి. ఆయన ప్రతిష్ట వేగంగా తగ్గుతోందని ఆన్‌లైన్‌ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఓ ప్రముఖ ఆన్‌లైన్‌ సర్వే ప్రకారం.. నెల క్రితం 34 శాతం మంది ఆయన్ని ప్రధానిగా చూడాలనుకుంటున్నామని తెలిపారు. ఇప్పుడు అలాంటి వారి సంఖ్య 12 శాతానికి పడిపోవడం గమనార్హం. కరోనా వేళ తీసుకున్న ఉద్దీపనల నిర్ణయాలు ఆయనపై వ్యతిరేక ప్రభావం చూపాయి. ప్రజలు, ఉద్యోగులకు అండగా నిలిచేందుకు అనేక పథకాలు ప్రకటించడం, వీటివల్ల ఖజానాపై పడే భారాన్ని తగ్గించేందుకు కొన్ని వర్గాలపై పన్నులు పెంచడం ఆయనపై వ్యతిరేకతకు దారితీసింది.

దీనికితోడు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ధరల పెరుగుదల ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ పరిస్థితికి ఆర్థికమంత్రి నిర్ణయాలే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకొకవైపు ఆయన సతీమణి అక్షతామూర్తిపై పన్ను ఎగవేత ఆరోపణలు సునక్‌ ప్రతిష్టను మరింత దెబ్బతీశాయి. అక్షత బ్రిటన్‌లో ‘నాన్‌-డొమిసైల్‌’ హోదాలో నివసిస్తున్నారు. ఆమెకు ఇప్పటికీ భారత పౌరసత్వమే ఉంది. వేరే దేశంలో స్థిర నివాసం ఉన్న వారికి బ్రిటన్‌లో ‘నాన్‌-డొమిసైల్‌’ పన్ను హోదాఇస్తారు. ఈ హోదా ఉంటే విదేశాల్లో ఆదాయానికి బ్రిటన్‌లో పన్ను కట్టక్కర్లేదు. ఈ హోదాను అడ్డుపెట్టుకొని అక్షత.. పన్ను ఎగవేస్తున్నారనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఇవి రాజకీయ ప్రేరిత ఆరోపణలని సునక్‌ సన్నిహితులు అంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement