Tuesday, November 26, 2024

క్రూడాయిల్‌ ధరల పెరుగుదల ఆందోళనకరం.. పరిస్థితులు గమనిస్తున్నాం: నిర్మలా

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. యావత్‌ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయని నిర్మలమ్మ అన్నారు. తూర్పు ఐరోపాలో ప్రస్తుత పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్లపై ప్రతికూల పరిణామాలను కలిగి ఉందన్నారు. చమురు ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 7ఏళ్ల గరిష్టానికి చేరుకోవడం కూడా కొంత ఆర్థికంగా ఇబ్బందికరమైన విషయమే అన్నారు. బ్యారెల్‌ ధర 100 డాలర్లకు చేరుకుందన్నారు. ఎల్‌ఐసీ ఐపీఓ కోసం డ్రాఫ్ట్‌ రెడ్‌-హెరింగ్‌ ప్రాస్పెక్టస్‌ ఫిబ్రవరి 13న విడుదలైందని తెలిపారు. ఈ ఆఫర్‌లో భాగంగా.. 316.25 మిలియన్‌ల షేర్లు అంటే దాదాపు 5 శాతం వరకు ప్రభుత్వం ద్వారా విక్రయించబడుతుందని వివరించారు. డీఆర్‌హెచ్‌పీ విడుదల.. ఐపీఓ పట్ల ఆసక్తిని పెంచిందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇది రూపొందించబడిన విధానం.. ఇది చాలా ఆసక్తిని కలిగించిందని తాను భావిస్తున్నట్టు వివరించారు. ముంబై పర్యటనలో భాగంగా నిర్మలా సీతారామన్‌ తొలి రోజు యూనియన్‌ బడ్జెట్‌పై చర్చించడానికి పరిశ్రమ, వాణిజ్యం, ఆర్థిక మార్కెట్‌ వాటాదారులతో సమావేశం అయ్యారు.

80 శాతం దిగుమతులు..

భారతదేశం.. 80శాతం అవసరాలను చమురు దిగుమతుల ద్వారా తీర్చుకుంటుందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. చమురు ధరలు పెరగడం.. ద్రవ్యోల్బణంపై కూడా ప్రభావం పడుతుందని వివరించారు. పెరుగుతున్న ముడి చమురు ధరలు కొంత ఆందోళనకరమైన అంశమే అన్నారు. పెరుగుతున్న క్రూడాయిల్‌ ధరల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉంటుందో కూడా గమనిస్తూనే ఉన్నామని వివరించారు. ఉక్రెయిన్‌-రష్యా ఉద్రిక్తతల ప్రభావం.. ఇప్పటి వరకు భారత్‌ వాణిజ్యంపై లేదన్నారు. పన్ను మినహాయింపు ఇస్తారా.. అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఇరు దేశాల మధ్య శాంతిస్థాపనకు దౌత్యపరమైన అంశం కీలకం అన్నారు. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మున్ముందు ఎలా జరుగుతుందో వేచి చూడాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకున్న ప్రధాని మోడీ.. దీపావళికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

ఆసక్తి ఆధారంగానే ఎల్‌ఐసీ ఐపీఓ..

మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులు, ఆసక్తి ఆధారంగానే ప్రభుత్వరంగ అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఇండియా (ఎల్‌ఐసీ)ని ఐపీఓగా తీసుకొచ్చేందుకు నిర్ణయించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా మార్కెట్స్‌లో నెలకొన్నపరిస్థితిని కూడా గమనిస్తూనే ఉందన్నారు. ఎల్‌ఐసీ ఐపీఓగా వచ్చేందుకు ఇదే సరైనా సమయమా..? అన్నది కూడా ఆలోచిస్తోందని తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వం కొంద ఆందోళన వ్యక్తం చేస్తోందని వివరించారు. ఎల్‌ఐసీ ఐపీఓపై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తున్నామని వివరించారు. రెండు రోజుల ముంబై పర్యటనలో భాగంగా చివరి రోజైన మంగళవారం.. విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement