ముంబయి – ప్రముఖ తబలా వాద్యకారుడు ఉస్తాక్ జాకీర్ హుస్సేన్ ఇకలేరు. అనారోగ్యంతో అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన తాజాగా మరణించారు. గత వారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆయన నేటి రాత్రి కన్నుమూసారు ఆయన వయస్సు 73 సంవత్సరాలు.
జాకీర్ హుస్సేన్ …
జాకీర్ హుస్సేన్ ప్రసిద్ధ తబలా వాద్యకారుడు, ఆయన మార్చి 9, 1951న బొంబాయిలో (ప్రస్తుతం ముంబై) జన్మించారు. ఆయన తండ్రి ఉస్తాద్ అల్లా రఖా ఖాన్. ఆయన ప్రసిద్ధ తబలా వాద్యకారుడు. తండ్రి దగ్గర తబలా వాయించే కళ నేర్చుకున్నాడు. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఏడేళ్ల వయసులో కచేరీలలో తబలా వాయించడం ప్రారంభించాడు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. జకీర్ యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి సంగీతంలో డాక్టరల్ డిగ్రీని పూర్తి చేశారు.
అవార్డులు, ప్రశంసలు
ఆ తర్వాత జాకీర్ 1991లో ప్లానెట్ డ్రమ్ కోసం డ్రమ్మర్ మిక్కీ హార్ట్‌తో కలిసి పనిచేశాడు. ఇది గ్రామీ అవార్డును గెలుచుకుంది. తరువాత సంవత్సరాల్లో హుస్సేన్ అనేక చిత్రాల సౌండ్‌ట్రాక్‌లకు సహకరించారు. జాకీర్ హుస్సేన్‌కు 1991లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. అట్లాంటాలో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు సంగీతం అందించిన బృందంలో ఆయన కూడా సభ్యుడు.
ఆల్-స్టార్ గ్లోబల్ కాన్సర్ట్‌లో పాల్గొనేందుకు 2016లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్‌హౌస్‌కి ఆహ్వానించిన తొలి భారతీయ సంగీతకారుడు కూడా. జాకీర్ హుస్సేన్‌కు 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్‌ను కూడా భారత ప్రభుత్వం ప్రదానం చేసింది. సంగీత ప్రపంచంలో యాక్టివ్‌గా ఉన్న జాకీర్ హుస్సేన్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.
ఆయన మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ తో సహా పలువురు రాజకీయ, క్రీడా, సినీ, సంగీత కళాకారులు సంతాపం ప్రకటించారు