Saturday, November 23, 2024

RIP – ప్ర‌ధాని ఆర్థిక మండ‌లి ఛైర్మ‌న్ బిబేక్ క‌న్నుమూత ..

న్యూ ఢిల్లీ – ప్రముఖ ఆర్థికవేత్త , ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబేక్‌ దెబ్రాయ్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 69. అనారోగ్యంతో చికిత్స పొందుతూ నేటి ఉదయం 7 గంటలకు ఆయన మరణించినట్లు ఢిల్లీ ఎయిమ్స్‌ తెలిపింది.

పద్మశ్రీ గ్రహీత అయిన దెబ్రాయ్‌.. భారత ఆర్థిక విధానాలను రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించారు. డెబ్రాయ్ అనేక పుస్తకాలు, పత్రాలు, ప్రముఖ కథనాలను రచించారు. పలు వార్తాపత్రికల్లో బహుళ సంపాదకులుగానూ పనిచేశారు. మహాభారతం, భగవద్గీత, హరివంశం, వేదాలు, వాల్మీకి రామాయణం సహా శాస్త్రీయ సంస్కృతి గ్రంథాలను సంక్షిప్త రూపంలో ఆంగ్లంలోకి అనువదించారు.


ఆయన కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీ, పూణెలోని గోఖలే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌కి ఛాన్సలర్‌గా పనిచేశారు. నవంబర్ 2004 నుంచి డిసెంబర్ 2009 వరకు నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటీటివ్ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికను సిఫార్సు చేసేందుకు జార్ఖండ్ ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన కమిటీకి ఆయన ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. అతను రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు కూడా.

- Advertisement -


2014 నుంచి 2015 వరకూ భారతీయ రైల్వేలను పునర్నిర్మించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన హైపవర్డ్ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు. 5 జనవరి 2015న ఆయన నీతీ ఆయోగ్‌లో శాశ్వత సభ్యునిగా నియమితుడయ్యారు. సెప్టెంబర్ 2017లో దెబ్రాయ్ ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

ప్ర‌ధాని సంతాపం..

కాగా, దెబ్రాయ్‌ మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దెబ్రాయ్‌.. ఆర్థిక, చరిత్ర, సంస్కృతి, రాజీకాయలు, ఆధ్యాత్మికత వంటి విభిన్న రంగాల్లో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. భారత ఆర్థిక విధానాల రూపకల్పనలో ఆయన చెరగని ముద్ర వేశారన్నారు. అంతేకాకుండా ప్రజా విధానానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement