వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జిమ్మీ కార్టర్క న్నుమూశారు. అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్‌లో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు జేమ్స్ ఇ. కార్టర్ తెలిపారు. రెండు నెలల క్రితమే (అక్టోబర్ 1న) 100వ పుట్టిన రోజు జరుపుకున్న కార్టర్.. అమెరికాకు 39వ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
దీంతో అమెరికా చరిత్రలో ఎక్కువ రోజులు జీవించిన తొలి ప్రెసిడెంట్‌గా రికార్డు సృష్టించారు. 2002లో నోబెల్ శాంతి పురస్కారం దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన డెమొక్రటిక్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు.
1924 అక్టోబర్ 1న రైతు కుటుంబంలో జన్మించిన జమ్మీ కార్టర్.. అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 1977లో అసాధారణ రీతిలో ఆయన దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 1981 వరకు ప్రెసిడెంట్‌గా కొనసాగారు. కాగా, 1946లో యూఎస్ నవల్ అకాడమీలో చేరిన జిమ్మీ కార్టర్, ఆ తర్వాత యూఎస్ నేవీ సబ్‌మెరైన్ సర్వీస్‌లో పని చేశారు. మిలిటరీ సేవలు ముగించుకున్న తర్వాత తన కుటుంబంతో కలిసి పల్లీల వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అమెరికాలో పెరిగిపోతున్న జాత్యాహంకారాన్ని చూసి తట్టుకోలేక 1960ల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1971లో తొలిసారిగా జార్జియా రాష్ట్రానికి గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సరిగ్గా ఆరేండ్ల తర్వాత రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్‌ను ఓడించి జిమ్మీ కార్టర్ అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.
కాగా, జిమ్మీ కార్టర్ మృతిపట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రమథ మహిళ జిల్ బైడెన్ సంతాపం తెలిపారు.