Friday, November 22, 2024

మణిపూర్‌లో మళ్లీ అల్లర్లు.. 40మంది ఉగ్రవాదుల కాల్చివేత

జాతి ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో వివాదంలో ఆజ్యం పోసేలా విధ్వంసానికి, హత్యలకు పాల్పడుతున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతాబలగాలు చర్యలు తీసుకున్నాయని, ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 40మంది ఉగ్రవాదులు మరణించారని ముఖ్యమంత్రి ఎన్‌.బీరెన్‌ సింగ్‌ ఆదివారం ప్రకటించారు. సైన్యం సహా వివిధ భద్రతాబలగాలతో రాష్ట్రంలో పలుచోట్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగంగా ఉగ్రవాదులు సాధారణ, నిరాయుధ ప్రజానీకంపై దాడులకు తెగబడుతున్నారని, వారి ఇళ్లను దగ్ధం చేస్తున్నారని పేర్కొన్నారు.

అత్యాధునిక ఏకే 47, ఎం -16, స్నైపర్‌ గన్‌లతో దాడులకు తెగబడుతున్నారన్న ఆయన వారిని అణచివేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంఫాల్‌ లోయలోని ఐదు ప్రాంతాల్లో తీవ్రవాదులు విధ్వంసకాండకు దిగారని, తెల్లవారుఝామున 2 నుంచి భద్రతబలగాలతో ఎదురుకాల్పులు జరుగుతున్నాయని వివరించారు. సెక్మాయ్‌, సుగ్ను, కుంబి, ఫయేంగ్‌, సెరౌ సహా అనేక ప్రాంతాల్లో నడిరోడ్లపై తీవ్రవాదుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు పోలీసు, భద్రతా బలగాలు గుర్తించాయని చెప్పారు.

25 రోజులుగా జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, పలు ప్రాంతాల్లో తీవ్రవాదులు దాడులకు తెగబడుతూ జాతుల మధ్య ఘర్షణలు పెచ్చుమీరేలా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఏరివేసేందుకు భద్రతాబలగాలు జల్లెడపడుతున్నాయి. హింసకు పాల్పడబోమంటూ గతంలో 25 కుకీ తీవ్రవాద గ్రూపులు కేంద్రంతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన కేంద్రాల్లో లొంగిపోవడం, ఆయుధాలు అప్పగించడం వంటివి చేయాలి. కొద్దిరోజుల నుంచి ఆయా గ్రూపులు ఒప్పందాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్నాయి. ఇంఫాల్‌ సమీపంలో నివసించే మెయితీలకు, కొండ ప్రాంతాల్లో జీవించే కుకీ జాతుల వారికి మధ్య చెలరేగిన వివాదం విధ్వంసానికి దారితీసింది. దీంతో రాష్ట్రం అంతటా అల్లర్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మణిపూర్‌లో పర్యటనకు వెళ్లనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement