Saturday, October 5, 2024

Modi | తెలంగాణ కాంగ్రెస్ పై ప్రధాని మోడీ విమర్శలు

మహరాష్ట్రలోని వాసింలో నేడు (శనివారం) ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న నరేంద్ర మోదీ.. దేశంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలపై, ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే.. తెలంగాణలో అమలు చేసిన రుణమాఫీ పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు గడుస్తున్నా రుణమాఫీ చేయలేదని విమర్శించారు. రుణమాఫీ ఎందుకు జరగడం లేదని అక్కడి రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రజలు మర్చిపోవద్దని మోదీ సూచించారు.

కర్ణాటకలోనూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అంతకు ముందున్న బీజేపీ స‌ర్కార్ రైతులకు అందజేసిన ఆర్థిక సాయాన్ని ఆపేసిందంటూ ధ్వజమెత్తారు. రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్, మహా వికాస్ అఘాడీని ఏమాత్రం విశ్వసించొద్దని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు.

ఇటీవల ఢిల్లీలో రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత కేసులో ఓ కాంగ్రెస్ నేత ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ సొమ్ముతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని పీఎం విమర్శించారు. యువతను కాంగ్రెస్ పార్టీ మాదక ద్రవ్యాల వైపు నెట్టి ఆ సొమ్ముతో ఎన్నికలకు ఉపయోగిస్తుందని ఆరోపించారు దేశ వ్యతిరేకంగా వ్యవహరించే వ్యక్తులతో కాంగ్రెస్ పార్టీ సన్నిహితంగా ఉంటోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరమైన అజెండాను ఓడించేందుకు మహారాష్ట్ర ప్రజలంతా ఏకం కావాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement