ఉట్నూర్, జూలై 4 (ప్రభ న్యూస్) : రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాలకు, లక్ష 50వేల మంది రైతులకు హక్కు పత్రాలు కల్పించడం జరుగుతుందని అటవీ శాఖ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలోని కేబి కాంప్లెక్స్ లో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు కేబి కాంప్లెక్స్ లోని కొమురం భీమ్ విగ్రహానికి పూజలు చేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… గిరిజన రైతులకు సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలు వస్తాయని కలలో ఉంచలేదని అన్నారు. ఆనాటి కాలంలో కొమురం భీమ్ జైల్ జంగల్ కోసం పోరాటం చేశారని, పోడు భూముల పట్టాల కోసం ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసినా ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు.
కొమురం భీం స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాలకు ఒకేసారి పోడు పట్టాలు ఇవ్వడం గర్వకారణం అన్నారు. ఇకపై రైతులు అడవులను కొట్టి పోడు భూములు చేయవద్దని, అటవీ అధికారులు అటవీ భూములకు హద్దులు ఏర్పాటు చేశారని, కొత్తగా అడవిని నరికితే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. హరితహారంలో ఇప్పటి వరకు రెండు లక్షల 77 కోట్ల మొక్కలు పెంచడం జరుగుతుందని, ఈ ఏడాది హరితహారంలో 20కోట్ల మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గిరిజనులకు వ్యవసాయ సాగుకోసం మోటర్లు త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని తెలిపారు.
అదిలాబాద్ జిల్లాలో 2200 మంది రైతులకు 13వేల ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని, ఈనెల 8లోగా పట్టాల పంపిణీ పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రైతులకు ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పోడు పట్టాల హక్కు పత్రాలను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమానికి మంత్రి, ప్రజాప్రతినిధులు, వందలాదిమంది గిరిజన రైతులు హాజరు కావడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డి.ఎస్.పి నాగేందర్, సీఐ రామకృష్ణ, ఎస్సై భరత్ సుమన్ పోలీసులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఖానాపూర్, బోథ్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు రేఖా శ్యాం నాయక్, బాపూరావు, ఆత్రం సక్కు, మాజీ ఎంపీ గోడం నగేష్, టీడీఏ చైర్మన్ కనక లక్కీ రావు, తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరి భాయి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఉట్నూర్ ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయ్, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, డిడి డాక్టర్ దిలీప్ కుమార్, ఏవో రాంబాబు, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, ఎంపీపీ పంద్ర జయవంతరావు, వైసీపీ దావూలే బాలాజీ, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరామ్ నాయక్ జాదవ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కందుకూరి రమేష్, సహకార చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నజీముద్దీన్, బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్, ప్రజా ప్రతినిధులు, నాయకులు అధికారులు, గిరిజన రైతులు, తదితరులు పాల్గొన్నారు.