దేశవ్యాప్తంగా గణేశ్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసిన వినాయకుడి మండపాలు దర్శనమిస్తున్నాయి. వివిధ రూపాల్లో వినాయకుడు కనువిందు చేస్తున్నాడు. అందరూ భక్తి శ్రద్ధలతో లంబోదరుడిని కోలుస్తున్నారు..
అయితే, ఈసారి కూడా వినాయక వేడుకల్లో ముంబైలోని జీఎస్‌బీ సేవా మండల్ మహాగణపతి విగ్రహం వార్తల్లో నిలిచింది. దేశంలోనే సంపన్న గణపతిగా పేరొందిన ఈ లంబోదరుడి ఉత్సవాల కోసం నిర్వాహకులు ఈ ఏడాది ఏకంగా రూ. 400 కోట్లతో బీమా చేయించారు.
ఈసారి 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మండపంలోని లంబోదరుడిని ఏకంగా 66 కేజీల బంగారం, 325 కేజీల వెండి ఆభరణాలతో అలంకరించడం జరిగింది. అందుకే ముందుజాగ్రత్తగా ఈ ఉత్సవాలకు రూ. 400.58 కోట్లతో బీమా చేయించామని నిర్వాహకులు ప్రముఖ మీడియా ఏజెన్సీతో చెప్పారు. 2023లో కూడా ఈ గణేశ్ మండపానికి రూ. 360.40 కోట్లకు బీమా తీసుకోవడం జాతీయ స్థాయిలో మీడియా దృష్టిని ఆకర్షించింది.
ఇక మండపంలో భద్రతా చర్యల్లో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా డిజిటల్ లైవ్ సేవలు, క్యూఆర్ కోడ్ వంటి వాటిని అందుబాటులో ఉంచారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 11 వరకు ఐదు రోజుల పాటు ఈ సంపన్న గణేశుడి వేడుకలను నిర్వహించనున్నారు