ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సిబిఐ సోమవారం అరెస్టు చేసింది. మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో సందీప్ ఘోష్ వైస్ ప్రిన్సిపాల్‌గా ఉన్న సమయంలో అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఘోష్‌తో పాటు బిప్లవ్ సింఘా, సుమన్ హజ్రా, అఫ్సర్ అలీ ఖాన్ అనే మరో ముగ్గురిని సీబీఐ అరెస్ట్ చేసింది.
కాగా, ఈరోజు (మంగళవారం) కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా… ఈ నలుగురు నిందితులను ఎనిమిది రోజుల పాటు సీబీఐ కస్టడీకి పంపుతూ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం కేసు విచారణను సీబీఐ కోర్టు సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది.
అయితే ఈ కేసును విచారించేందుకు నిందితులందరినీ 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును అభ్యర్థించగా… కోర్టు కేవలం ఎనిమిది రోజుల కస్టడీని మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని నలుగురిలో ఒకరైన అఫ్సర్ అలీఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
ఆసుపత్రి సెమినార్ హాలులో ఆగస్టు 9న హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ కేసును సైతం సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. హత్య కేసులో సందీప్ ఘోష్ ను సీబీఐ వరుసగా 15 రోజుల పాటు విచారించింది. అనంతరం ఆర్థిక అవకతవకల కేసులో అతడిని అరెస్ట్ చేసింది. సందీప్ ఘోష్‌పై ఆరోపణల నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.