ఆర్టీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ సోమవారం నాడు అరెస్ట్ చేసింది. వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగంపై ఆయనను అరెస్టు చేసినట్లు సీబీఐ తెలిపింది. సందీప్ ఘోష్ వైస్ ప్రిన్సిపాల్‌గా ఉన్న సమయంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆయనపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
ఆ క్రమంలో తాజా అరెస్టు చోటుచేసుకున్నది. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు సందీప్ ఘోష్‌తో పాటు మూడు ప్రైవేటు సంస్థలపై కూడా సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అవినీతి కేసుకు సంబంధించి ఘోష్ నివాసంపై గత నెల 25న సీబీఐ దాడులు జరిపింది.
ఆసుపత్రి సెమినార్ హాలులో ఆగస్టు 9న హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ కేసును సైతం సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. ఘోష్ ఆర్థిక అవకతవకలపై మనీలాండరింగ్ కేసు కింద ఈడీ కూడా విచారిస్తున్నది. సందీప్ ఘోష్‌పై ఆరోపణల నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.