హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉంటుందని, ఏ ఒక కులంతో పార్టీలు మనుగడ సాధించడం కష్టమని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రెడ్లకు, వెలమ సామాజిక వర్గాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, చొక్కారావు, పీవీ నరసింహరావు లాంటి నేతలు కాంగ్రెస్ కోసం ఎంతో కష్టపడి పని చేశారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలియని వాళ్లు ఏదో మాట్లాడితే.. వాటిని పార్టీ వ్యాఖ్యలుగా భావించొద్దన్నారు.
అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని, సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆయన వివరించారు. రెడ్డి సామాజిక వర్గానికే పార్టీ పగ్గాలు అప్పగిస్తే రాజకీయ పార్టీలకు మనుగడ ఉంటుందని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను.. ఆయన వ్యక్తిగతమని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో అన్ని వర్గాల వారు పీసీసీలుగా, సీఎంలు అయ్యారని ఆయన తెలిపారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై పార్టీలో ఎలాంటి నిర్ణయం ఉంటుందని మీడియా ప్రశ్నించగా.. రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలన్ని అధిష్టానం దృష్టికి వెళ్లాయన్నారు. అయినా కర్ణాటక రాష్ట్రంలో చేసిన వ్యాఖ్యలను పెద్దవిగా చేయవద్దని , అవి పార్టీ వ్యాఖ్యలుగా భావించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..