Friday, November 22, 2024

రేవంత్, కొండా కలిసి కొత్త పార్టీ ? కేసీఆర్ పని ఇక అంతేనా..!!

రేవంత్ రెడ్డి… తెలంగాణలో మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్. అయితే గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి త్వరలోనే కొత్త పార్టీతో ప్రజల్లోకి రాబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేసి మరో రెండు మూడు నెలల్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అనౌన్స్ చేశాడు. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డికి పిసిసి ఇవ్వకూడదని సీనియర్ నాయకులు పట్టుబట్టి కూర్చున్నారు. మరికొంత మంది రేవంత్ రెడ్డికి పిసిసి ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నిలుస్తుందని మద్దతు నిలిచారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో నాయకులు అభిప్రాయ సేకరణ కూడా జరిగింది. ఆ సమయంలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక రావడంతో పి సి సి వ్యవహారం కాస్త పక్కన పెట్టారు.

ఇక రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన నాలుగేళ్లు అవుతుంది. కాంగ్రెస్ లో చేరిన కొన్నాళ్ల తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా అధిష్టానం ప్రకటించింది. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత పిసిసి మార్పు ఉంటుందని అధిష్టానం స్పష్టం చేసింది. దీంతో పలువురు తెరపైకి వచ్చారు. 2015 నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ ఉన్నారు. అయితే అప్పటి నుంచి ఏ ఒక్క ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఇక గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అధికార టీఆర్ఎస్ వైపు వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ పిసిసి అప్పగించాలని డిమాండ్ వచ్చింది.

అయితే రేవంత్ అంటే గిట్టని కొందరు కాంగ్రెస్ నేతలు తమ పార్టీ వారిని వారే పెడుతున్నారని రేవంత్ వర్గం బలంగా ఆరోపిస్తోంది. ఇక మొన్నటికిమొన్న రేవంత్ చేసిన పాదయాత్ర కు సైతం అడ్డంకులు పెట్టాలని చూసినట్లు రేవంత్ వర్గం చెబుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కి ఇటీవల మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, పాల్వాయి హర్షవర్ధన్ తదితరులు రాజీనామా చేశారు. తాజాగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీలో పార్టీకి చెందిన నాయకులే పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని వారి సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డిలు కలిసి కొత్త పార్టీ పెడతారన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఆర్థికంగా బలంగా ఉన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కుటుంబం కూడా విలువలకే ప్రాధాన్యం ఇస్తుంది. కొండా వెంకట రంగారెడ్డి (కేవీ రంగారెడ్డి) మనుమడిగా, అపోలో హాస్పిటల్స్ గ్రూపులో కీలకంగా ఉన్న విశ్వేశ్వర్‌రెడ్డి తొందరపడి నిర్ణయం తీసుకునే వ్యక్తి కాదని, అందుకే తాను మూడు నెలల తరువాత తన కార్యాచరణను ప్రకటిస్తానని వెల్లడించారని చర్చ నడుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో రాజన్నరాజ్యం తెస్తానని వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో పూర్తి ప్రాంతీయ భావం, సామాజిక సమీకరణాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణలోనే త్వరలోనే కొత్త పార్టీ రానుందని ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement